భారత్‌లో హెచ్ఎస్బీసీ ఒమన్ బిజినెస్ దోహా బ్యాంక్ పరం!
దుబాయ్: భారత్‌లో హెచ్ఎస్బీసీ బ్యాంక్ ఒమన్ వ్యాపారాన్ని దోహా బ్యాంక్ సొంతం చేసుకోనుంది. దోహా బ్యాంక్ ఖతార్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌లో హెచ్ఎస్బీసీ బ్యాంక్ ఒమన్ రుణాల (ఆస్తుల) విలువ 2013 డిసెంబరు 31 నాటికి దాదాపు రూ.350 కోట్లు.
భారత్‌లో హెచ్ఎస్బీసీ బ్యాంక్ ఒమన్ రెండు బ్రాంచీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. డీల్ వ్యవహారాన్ని దోహా బ్యాంక్ చైర్మన్ షేక్ ఫహాద్ బిన్ మహ్మద్ బిన్ జబార్ అల్ థానీ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ప్రకటన ప్రకారం, హెచ్ఎస్బీసీ బ్యాంక్ ఒమన్ సిబ్బంది మొత్తం ఇకపై దోహా బ్యాంక్ ఉద్యోగులుగా మారతారు. హెచ్ఎస్బీసీ (బ్యాంక్) ఒమన్‌లో దాదాపు 51 శాతం పరోక్ష వాటా కలిగిఉన్న హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్ కూడా ఈ లావాదేవీని ధృవీకరించింది. కాగా ఈ లావాదేవీకి భారత్, ఖతార్, ఒమన్ రెగ్యులేటరీ అధికారుల ఆమోదముద్రలు పడాల్సి ఉంది.