ఢాకా మృతులకు షేక్ హసీనా నివాళి
ఢాకా: ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సోమవారం ఘనంగా నివాళులు అర్పించింది. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సైనిక అధికారులు, కేబినెట్ మంత్రులు బాధితులకు నివాళులు అర్పించారు. వివిధ దేశాలకు చెందిన దౌత్య అధికారులు సైతం ఈ కార్యక్రమానికి హాజరై... మృతులకు అంజలి ఘటించారు. ఢాకా ఉగ్రదాడిలో ఓ భారతీయ యువతితో పాటు, అమెరికన్ సహా 20మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
మరోవైపు ఢాకా రెస్టారెంట్లో మారణహోమం సృష్టించిన ఆరుగురు ఉగ్రవాదుల ఫొటోలను బంగ్లాదేశ్ పోలీసులు విడుదల చేశారు. వీరంతా బంగ్లాలోని సంపన్న కుటుంబాలకు చెందిన విద్యావంతులని పేర్కొన్నారు. చనిపోయిన ఉగ్రవాదుల్లో బంగ్లాదేశ్ అధికార అవామి లీగ్ సీనియర్ నాయకుడి కుమారుడు కూడా ఉన్నట్టు స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది. దాడి నెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ హస్తం ఉన్నట్టు రక్షణశాఖ అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.
దాడికి ఐఎస్ఐఎస్తో సంబంధం లేదని తొలుత బంగ్లా పోలీసులు ప్రకటించినా... ఫొటోలు విడుదలైన తర్వాత కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు విడుదలచేసిన ఛాయాచిత్రాలు.. ఐఎస్ఐఎస్ వెబ్సైట్లో పెట్టిన టెరరిస్టుల ఫొటోలతో సరిపోవడంతో ఉగ్రవాదులు బంగ్లాదేశ్లో ఐసిస్ సానుభూతిపరులు కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు.