స్వగ్రామం చేరిన నూర్జహాన్ మృతదేహం
ఉండి : ఉపాధి నిమిత్తం ఖతార్ వెళ్లి అక్కడి వారి అకృత్యాలకు బలైన ఉండికి చెందిన షేక్ నూర్జహాన్ మృతదేహం శుక్రవారం స్వగ్రామం చేరుకుంది. ఆమె మృతదేహంతో నూర్జహాన్ కుటుంబ సభ్యులు, బంధువులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తారనే సమాచారంతో ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, భీమవరం 1టౌన్, 2 టౌన్ పోలీస్స్టేషన్ల నుంచి పోలీసులను ముందు జాగ్రత్తగా ఉండికి రప్పించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.
నూర్జహాన్ మృతదేహం ఉండికి రావడంతో కుటుంబీకులు, బంధువులను పిలిపించి భీమవరం రూరల్ సీఐ ఆర్జి జయసూర్య, భీమవరం 1 టౌన్ సీఐ డి.వెంకటేశ్వరరావుల పర్యవేక్షణలో ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకుని మృతదేహాన్ని అప్పగించారు. నూర్జహాన్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు నినాదాలు చేశారు. అనంతరం నూర్జహాన్ మృతదేహాన్ని ఆమె అత్తవారిల్లయిన భీమడోలు మండలం పాతూరుకు తీసుకువెళ్లిపోయారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.