షెల్లీ ఫ్రేజర్ ‘డబుల్’
మాస్కో (రష్యా): ఒకవైపు తమ దేశం అథ్లెట్స్‌పై డోపింగ్ ఆరోపణలు వినిపిస్తున్నా... మరోవైపు ఇవేమీ పట్టించుకోకుండా జమైకా అథ్లెట్స్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో దూసుకుపోతున్నారు. శుక్రవారం జరిగిన మహిళల 200 మీటర్ల ఫైనల్లో షెల్లీ ఆన్ ఫ్రేజర్ మళ్లీ మెరిసింది. 22.17 సెకన్లలో గమ్యానికి చేరుకొని విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో 22 ఏళ్ల తర్వాత ఒకే చాంపియన్‌షిప్‌లో 100, 200 మీటర్ల రేసుల్లో స్వర్ణాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా షెల్లీ గుర్తింపు పొందింది. చివరిసారి 1991లో కాట్రిన్ క్రాబీ ఈ ఘనత సాధించింది. బ్రిటన్ విఖ్యాత అథ్లెట్ మహ్మద్ ఫరా కూడా పసిడి ‘డబుల్’ నమోదు చేశాడు. ఈ చాంపియన్‌షిప్‌లో ఇప్పటికే 10 వేల మీటర్ల రేసులో స్వర్ణం నెగ్గిన ఫరా శుక్రవారం జరిగిన 5 వేల మీటర్ల రేసులోనూ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆరంభంలో కాస్త వెనుకబడ్డా చివర్లో అనూహ్యంగా పుంజుకున్న ఈ లండన్ ఒలింపిక్ చాంపియన్ 13 నిమిషాల 26.98 సెకన్లలో లక్ష్యానికి చేరుకున్నాడు.
జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ రెండో స్వర్ణంపై గురి పెట్టాడు. 100 మీటర్లలో విజేతగా నిలిచిన అతను శనివారం జరిగే 200 మీటర్ల ఫైనల్‌కు అర్హత పొందాడు. సెమీఫైనల్స్‌లోని రెండో రేసులో బోల్ట్ 20.12 సెకన్లలో గమ్యానికి చేరుకొని ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. పురుషుల 4ఁ400 మీటర్ల రిలేలో అమెరికా జట్టు (2ని:58.71 సెకన్లు) స్వర్ణం సాధించింది. పురుషుల షాట్‌పుట్‌లో డేవిడ్ స్టోర్ల్ (జర్మనీ-21.73 మీటర్లు); లాంగ్‌జంప్‌లో మెన్కోవ్ (రష్యా-8.56 మీటర్లు); మహిళల హ్యామర్ త్రోలో తాతియానా లిసెంకో (రష్యా-78.80 మీటర్లు) పసిడి పతకాలు గెల్చుకున్నారు.