జిల్లాలకు ‘షీ’ టీమ్‌లు
పబ్లిక్ ప్రదేశాల్లో నిఘా
మహిళలను వేధించేవారి ఆటకట్టు
ప్రతి జిల్లా కేంద్రానికి రెండు షీ టీమ్స్
ఈవ్ టీజింగ్ చేసేవారిపై కఠిన చర్యలు చేపడతామన్న సీఐడీ అదనపు డీజీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈవ్టీజర్ల భరతం పట్టిన ‘షీ’ టీమ్‌లు ఇప్పుడు జిల్లాలకు బయలుదేరాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పబ్లిక్ పార్కులు, ఆస్పత్రులు, పాఠశాలలు, కళాశాలలు వంటి పబ్లిక్ ప్రదేశాల్లో మాటు వేసి మహిళలను వేధించే పోకిరీలకు అరదండాలు వేయనున్నాయి. అసభ్య చేష్టలు, వేధింపుల దృశ్యాలను రహస్య కెమెరాల్లో చిత్రీకరించి సాక్ష్యాధారాలతో సహా పట్టుకోనున్నాయి.
హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో విజయవంతమైన ‘షీ టీమ్స్’ను అన్ని జిల్లాలకు ప్రభుత్వం విస్తరించింది. ప్రతి జిల్లా కేంద్రానికి సుశిక్షితులైన రెండు ‘షీ టీమ్’లను పంపిం ది. హైదరాబాద్ అదనపు కమిషనర్ స్వాతి లక్రా, ఐజీ(వెల్ఫేర్) బాలనాగదేవి, డీఐజీ(పరిపాలన) కల్పనా నాయక్, డీసీపీ రమా రాజేశ్వరిలతో కలిసి సీఐడీ అదనపు డీజీ నారాయణ్, డీఐజీ సూర్యనారాయణ బుధవారం ఈ బృందాలను జిల్లాలకు పంపారు.
ఈ సందర్భంగా అదనపు డీజీ నారాయణ్ విలేకరులతో మాట్లాడారు. ఈ ‘షీ’ టీమ్‌లకు తోడు స్థానిక అవసరాలకు తగినట్లుగా జిల్లాల్లో అదనపు బృందాలను ఏర్పాటు చేసుకునే వెసులుబాటును ఎస్పీలకు కల్పించామని చెప్పారు. యువతులను, మహిళలను వేధిస్తూ తొలిసారిగా దొరికే నిందితులకు కౌన్సెలింగ్, మళ్లీ తప్పు చేస్తే అరెస్టు, తీవ్రమైన వేధిం పులకు పాల్పడితే నిర్భయ చట్టాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించారు. అనంతరం జంట నగరాల పరిధిలో షీ టీమ్‌లకు పట్టుబడినవారి వివరాలను వెల్లడిం చారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ పట్టుబడి నిందితుల్లో 33 మంది ఇప్పటికే శిక్షకు గురయ్యారని చెప్పారు.
ఇదీ ‘షీ’ టీమ్..
‘షీ’ టీమ్‌లో ఒక పురుష/మహిళా ఎస్ఐ, ఒక మహిళా కానిస్టేబుల్, ఇద్దరు/ముగ్గురు కానిస్టేబుళ్లు ఉంటారు.
వీరి వద్ద ఒక రహస్య కెమెరా (పెన్ కెమెరా/బటన్ కెమెరా/సెల్‌ఫోన్ కెమెరా) ఉంటుంది. దీని ద్వారా ఆకతాయిల చేష్టలను రికార్డు చేస్తారు.
ఈవ్ టీజర్లను అక్కడికక్కడే అదుపులోకి తీసుకుని.. తదుపరి చర్యలు చేపడతారు.
భరతం పడుతున్నారు..
షీ టీమ్‌లు ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్న వారి భరతం పడుతున్నాయి. దీంతో కేసుల నమోదు సంఖ్య బాగా పెరిగింది. మహిళలపై హింసకు సంబంధించి 2014లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,844 కేసులు నమోదుకాగా.. ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనే 961 కేసులు బుక్ అయ్యాయి. ఈవ్‌టీజింగ్‌కు సంబంధించి 2014లో 1,111 కేసులు నమోదుకాగా... 959 మందిని అరెస్టు చేశారు. 2015లో ఫిబ్రవరి చివరి నాటికే 300 కేసులు నమోదుకాగా 311 మంది ఈవ్ టీజర్లను అరెస్టు చేశారు.