అరచేతిలో అతివల భద్రత!
మహిళలకు అండగా రూపొందిన పోలీసు యాప్స్
సిటీబ్యూరో: నగర పోలీసు విభాగం అతివల రక్షణకు పెద్దపీట వేస్తోంది. ఓ పక్క షీ-టీమ్స్ ద్వారా క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న అధికారులు... సామాజిక మాధ్యమాల ద్వారానూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. పోలీసులు- ప్రజల మధ్య వారధిగా ఏర్పాటు చే సిన మొబైల్ యాప్ ‘హాక్-ఐ’లో ఈ కోణానికి సంబంధించి మూడు అంశాలను చేర్చారు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ప్లేసోర్ట్ నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఎస్ఓఎస్...
విపత్కర పరిస్థితుల్లో అతివలకు అండగా ఉండేందుకు ‘ఎస్ఓఎస్’ విభాగం ఏర్పాటైంది. ‘హాక్-ఐ’లో ఉన్న ఈ విభాగంలోకి ప్రవేశించిన తర్వాత ప్రాథమికంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. హెల్ప్, డేంజర్ వంటి అంశాలను పొందుపర్చడంతో పాటు సన్నిహితులు, స్నేహితులకు చెందిన ఐదు ఫోన్ నెంబర్లనూ ఫీడ్ చేయాలి. ‘క్రియేట్’ బటన్ నొక్కడం ద్వారా దీని షార్ట్‌కట్ మొబైల్ స్క్రీన్‌పై వస్తుంది. అత్యవసర సమయాల్లో ఈ ‘ఎస్ఓఎస్’ను ప్రెస్ చేస్తే చాలు... జోనల్ డీసీపీ, డివిజనల్ ఏసీపీలతో పాటు సమీపంలో ఉన్న పెట్రోలింగ్ వాహనాలకు సెల్‌ఫోన్ వినియోగదారుల లొకేషన్ జీపీఎస్ వివరాలతో సహా చేరుతుంది. పొందు పరిచిన నెంబర్లకూ ఈ సమాచారం వెళ్తుంది. ఓసారి ‘ఎస్ఓఎస్’ను నొక్కిన తర్వాత 9 సెకండ్ల కౌంట్‌డౌన్ ఉంటుంది. ఎవరైనా పొరపాటున ప్రెసి చేసి ఉంటే ఈ సమయంలో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ సమయం తర్వాత అధికారులు రంగంలోకి దిగి జీపీఎస్ ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు.
ఉమెన్ ట్రావెల్ మేడ్ ఈజీ...
విద్య, ఉద్యోగ రంగాల్లో మహిళలు/యువతులు పురుషులకు దీటుగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వేళకాని వేళల్లోనూ ఒంటరిగా ప్రయాణించడం అనివార్యంగా మారింది. ఇదే కొన్ని సందర్భాల్లో ఆకతాయిలు, దుండగులకు కలిసి వస్తోంది. నగరంలో ఇలా ప్రయాణాలు చేసే మహిళల కోసం ‘హాక్-ఐ’లో ఏర్పాటు చేసిన విభాగమే ఉమెన్ ట్రావెల్ మేడ్ ఈజీ. ప్రయాణం ప్రారంభానికి ముందు యాప్‌లోని ఈ విభాగంలోకి ప్రవేశించిన తర్వాత సదరు మహిళ/యువతి ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తున్నారో (డెస్టినేషన్) ఫీడ్ చేయాల్సి ఉంటుంది. వారు ఎక్కుతున్న బస్సు, ఆటో, క్యాబ్ నెంబర్లను ఫొటో లేదా మాన్యువల్‌గా నమోదు చేయాలి. జీపీఎస్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ విభాగం ద్వారా ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి అది పూర్తయ్యే వరకు కమిషనరేట్‌లోని ఐటీ సెల్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. నిర్దేశించిన డెస్టినేషన్ కాకుండా సదరు వాహనం వేరే మార్గంలో ప్రయాణిస్తే పోలీసులే గుర్తించి ప్రయాణికురాలిని సంప్రదిస్తారు. మార్గమధ్యంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే క్షణాల్లో ఫిర్యాదు చేసేందుకు ఓ బటన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికురాలు సురక్షితంగా గమ్యం చేరిన తర్వాత సమాచారం ఇచ్చే వరకు పర్యవేక్షణ కొనసాగుతుంది. ఈ మధ్యలో ఎప్పుడు అవసరమైనా నిమిషాల్లో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు.
క్రైమ్ ఎగనెస్ట్ ఉమెన్...
మహిళల భద్రత కోసం ‘హాక్-ఐ’లో ఏర్పాటు చేసిన మరో విభాగం ‘క్రైమ్ ఎగనెస్ట్ ఉమెన్’. వారు పని చేసే ప్రాంతంలో, ప్రయాణించే మార్గంలో, ఇంట్లో... ఇలా ఎ క్కడ ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు, వేధింపులు ఎ దురైనా ఈ విభాగాన్ని ఆశ్రయించవచ్చు. నేరుగా పో లీ సుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లే కుండా..ఈ విభాగంలో ఉన్న ఆప్షన్స్‌ను సెలెక్ట్ చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రాథమింగా ఈ స మాచారాన్ని విశ్లేషించే ఐటీ సెల్ ఫిర్యాదు స్వభావాన్ని బట్టి పోలీసులు, షీ-టీమ్స్, సైబర్ పోలీసులకు సమాచారం అందిస్తారు. దీంతో పాటు డయల్ ‘100’, పో లీ సు ఫేస్బుక్, వాట్సాప్ (9490616555) ద్వారా నూ ఎ లాంటి సహాయ సహకారాలు కావాలన్నా పొందవచ్చు.