బంగ్లాదేశ్లో వరుస పేలుళ్లు
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వరుస బాంబుపేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 90 మందికి పైగా గాయపడ్డారు. 17వ శతాబ్థానికి చెందిన షియాల ప్రార్థనా స్థలం వద్ద శనివారం తెల్లవారు జామున ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. మొహరం సందర్భంగా నిర్వహించే అశుర వేడుకలకు జనం ఎక్కువగా గుమికూడిన సమయంలో పేలుళ్లు జరగడంతో క్షతగాత్రులు అధిక సంఖ్యలో ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుళ్లకు సంబంధించి ఉగ్రవాద సంస్థలు ఎలాంటి ప్రకటన చేయలేదని పోలీసు అధికారులు వెల్లడించారు. దేశంలోని ప్రజలను భయాందోళనకు గురిచేయడానికే ఈ దాడులకు పాల్పడ్డారని ఎడిషనల్ డైరెక్టర్ జనరల్ హసన్ తెలిపారు.