ఏపీ ఉద్యోగులంతా ఇక వెలగపూడికి
అమరావతి ఏర్పాటయ్యే వరకు తాత్కాలిక రాజధానిగా వెలగపూడి
హైదరాబాద్: గుంటూరు జిల్లా వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ఉద్యోగులంతా వచ్చే జూన్ నాటికి అమరావతికి తరలివెళ్లాలని ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. అయితే అక్కడ వసతులు లేకుండా తరలివెళ్లడం సాధ్యం కాదని ఉద్యోగులు తేల్చిచెప్పడంతో ప్రభుత్వం హడావిడి నిర్ణయం తీసుకుంది. వెలగపూడిలో తాత్కాలిక రాజధానిని నిర్మించాలని నిర్ణయించింది.
నిజానికి అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక రాజధాని నిర్మించాలని గతంలోనే ప్రభుత్వం సంకల్పించింది. అయితే నిధులు వెచ్చింపుపై విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. సింగపూర్ సంస్థల నుంచి మాస్టర్ ప్లాన్లలో మార్పులతో పాటు మాస్టర్ డెవలపర్ ఎంపికలో ప్రతిష్టంభన నెలకొనడం వంటి కారణాలతో మళ్లీ తాత్కాలిక రాజధాని నిర్మాణం చేపట్టాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.
వచ్చే ఆరు నెలల్లో ఈ తాత్కాలిక రాజధాని పూర్తయ్యేలా చూడాలని నిర్ణయించిన ప్రభుత్వం గురువారం టెండర్లను ఆహ్వానించనుంది. వెలగపూడిలోని దాదాపు 26 ఎకరాల్లో రాజధాని కార్యకలాపాల నిర్వహణకు అవసరమయ్యే నిర్మాణాలు చేపడుతారు. ఇందుకు గాను ప్రభుత్వం 180 కోట్ల రూపాయలు వెచ్చించబోతోంది. మొత్తం 6 లక్షల చదరపు అడుగుల మేరకు గ్రౌండ్, మరియు ఫస్ట్ ఫ్లోర్ ఉండే విధంగా ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ మాడల్ లేదా ఆర్సీసీ నిర్మాణాల్లో తాత్కాలిక రాజధానిని నిర్మిస్తారు. వచ్చే ఆరు నెలల్లో ఈ నిర్మాణాలు పూర్తయ్యేలా టెండర్లను ఆహ్వానిస్తారు.
ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖలను విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు తరలించిన ప్రభుత్వం వచ్చే జూన్ నాటికి ఉద్యోగులందరినీ రాజధాని ప్రాంతానికి తరలించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కనీసం జూలై నాటికైనా తాత్కాలిక రాజధాని నిర్మాణం పూర్తి చేయగలిగితే పరిపాలనా ఇబ్బందులు తొలగిపోతాయన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
మూడు గ్రామాలు ఖాళీ
ఇలా వుండగా, అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో గ్రామాలను ఖాళీ చేయించబోమని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చింది. రాజధాని ప్రధాన నిర్మాణాలు చేపట్టే తల్లాయపాలెం, ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెం గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించబోతోంది. రైతుల నుంచి ఆ గ్రామాల భూముల తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు వారి నివాసాలను కూడా ఖాళీ చేయించడానికి త్వరలోనే నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. వీరికి ఆ గ్రామాల పరిధి అవతల దూరంగా ఇళ్ల కోసం స్థలాలు కేటాయిస్తారు.
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దాదాపు 20 వేలకుపైగా ఎకరాల భూములతో పాటు రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి ఇప్పటికే 33,400 ఎకరాలను సేకరించిన విషయం తెలిసిందే. అయితే ఆ రైతులకు ఏ ప్రాంతంలో స్థలాలు కేటాయిస్తారన్న విషయం ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ విషయంలో రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుండగా, వారికి ఎక్కడెక్కడ స్థలాలు కేటాయించాలన్న అంశాన్ని ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన ప్రకటన జారీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.