అగ్రస్థానంలో శిఖర్ గార్గ్
తెలంగాణ రాష్ట్ర సెయిలింగ్ చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఓపెన్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు పోటీల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన సెయిలర్ శిఖర్ గార్గ్ ఆకట్టుకున్నాడు. హుస్సేన్‌సాగర్‌లో జరుగుతోన్న ఈ పోటీల్లో లేజర్ రేడియల్ విభాగంలో శిఖర్ గార్గ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆదివారం ఈ విభాగంలో 4 రేసులు జరుగగా రెండింట్లో నెగ్గిన శిఖర్ మరో రేసులో రెండో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా తొలిరోజు ముగిసేసరికి 9 పాయింట్లతో తొలిస్థానాన్ని దక్కించుకున్నాడు. మహారాష్ట్ర సెయిలర్లు శేఖర్ యాదవ్ 19 పాయింట్లతో రెండోస్థానంలో, అవినాశ్ యాదవ్ 20 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నారు. జూనియర్స్ లేజర్ 4.7 విభాగంలో మహారాష్ట్ర కుర్రాడు వివిన్ వినీల్ 7 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచాడు.
తొలి రేసులో వివిన్ విజేతగా నిలవగా, తెలంగాణకు చెందిన కోటేశ్వర్రావు రన్నరప్‌గా నిలిచాడు. అయితే తొలి రోజు రేసులు పూర్తయ్యే సరికి మిగిలిన రేసుల్లో నిలకడగా రాణించిన మహేశ్ బాలచందర్ 7 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. హైదరాబాద్ సెయిలింగ్ వీక్ విజేత రామ్ మిలన్ యాదవ్ ఈ విభాగంలో 9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. సీనియర్ కేటగిరీలో నేవీ క్లబ్‌కు చెందిన అజయ్ సింగ్ రాజ్‌పుత్ 3 పాయింట్లతో తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. కర్ణాటక సెయిలర్ లిమ్ జాన్ (6 పాయింట్లు), ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జీసీకే రెడ్డి (7 పాయింట్లు) వరుసగా రెండు, మూడో స్థానాలను సాధించారు. నాలుగురోజుల పాటు జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తం 50 మంది సెయిలర్లు తలపడుతున్నారు.