'అమెరికాలో షిరిడీ' నిర్మాణంలో మరో ముందడుగు
షిరిడీ నిర్మాణ ఆకృతుల కోసం లగాన్ ఆర్ట్ డైరెక్టర్
సౌత్ ప్లైన్ఫీల్డ్(న్యూజెర్సీ):
న్యూజెర్సీలో సాయిదత్త పీఠం 'అమెరికాలో షిరిడీ' నిర్మించాలనే మహాసంకల్పాన్ని చేపట్టింది. రెండు సంవత్సరాల క్రితం సరిగ్గా జూన్ 3న తలపెట్టిన సాయి పాదుకా యాత్ర ముగింపు దగ్గర పడుతుండటంతో షిరిడీ నిర్మాణ ఆకృతులపై దృష్టి పెట్టింది. దీని కోసం భారతీయ ప్రఖ్యాత కళా దర్శకులు నితిన్ చంద్రకాంత్ దేశాయ్‌ను అమెరికాకు రప్పించింది. జోథా అక్బర్, లగాన్, దేవదాస్ లాంటి గొప్ప చిత్రాలకు కళా దర్శకత్వం వహించిన నితిన్ దేశాయ్ ఇప్పుడు 'అమెరికాలో షిరిడీ' నిర్మాణానికి ఆకృతులు ఇవ్వనున్నారు.
దీని కోసం అమెరికాలో స్థానిక ఆర్కిటెక్ట్ కిషోర్ జోషితో కలిసి నితిన్ దేశాయ్ ప్రస్తుతం పనిచేస్తున్నారు. సాయి దత్త పీఠాన్ని సందర్శించిన నితిన్ దేశాయ్ షిరిడీ నిర్మించే ప్రదేశానికి వెళ్లి స్థలాన్ని చూసి సంబంధించిన దృశ్యరూప చిత్తు ప్రతిని కూడా చూపించారు. సాయి దత్త పీఠం బోర్డు డైరక్టర్లతో చర్చించి ఆకృతులపై వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. అందరి అభిప్రాయాలను పరిశీలించి వినూత్నంగా.. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. ఆకృతులు అందిస్తానని దేశాయ్ తెలిపారు. "అమెరికాలో షిరిడీ" అనే మహాసంకల్పానికి భక్తుల నుంచి మంచి స్పందన వస్తుందని సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి తెలిపారు. షిరిడీ నిర్మాణంలో నితిన్ దేశాయ్ భాగస్వాములు కావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.