పోలీసు కస్టడీకి శివ గ్యాంగ్
మూడు రోజులు విచారించనున్న పోలీసులు
బంగారం రికవరీ కోసం యత్నాలు
సాక్షి, సిటీబ్యూరో: కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలులో ఉన్న శివ గ్యాంగ్ సభ్యులు ముగ్గురినీ నార్సింగి పోలీసులు సోమవారం కస్టడీలోకి తీసుకున్నారు. వీరిని మూడు రోజుల పాటు విచారించనున్నారు.
ఈనెల 15న శంషాబాద్‌లో పోలీసు కాల్పుల్లో కరుడుగట్టిన చైన్‌స్నాచర్ శివ మృతి చెందగా, పోలీసులు అదే రోజు శివ గ్యాంగ్ సభ్యులైన అతని భార్య నాగలక్ష్మి, అనుచరులు జగదీష్, రాజ్‌కుమార్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నార్సింగిలోని వీరింటిని సోదా చేసిన పోలీసులకు ముత్తూట్, శ్రీరామా ఫైనాన్స్ తదితర కంపెనీల్లో తాకట్టుపెట్టిన బంగారు నగల రసీదులతో పాటు ఆయా బ్యాంకుల ఫిక్సిడ్ డిపాజిట్ రసీదులు కూడా దొరికాయి.
ఈ రసీదుల ఆధారంగా ఆయా ఫైనాన్స్ కంపెనీల్లో ఉన్న బంగారాన్ని రికవరీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు నిందితుల నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు నగలు, ఖరీదైన వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు మరింత రికవరీపై దృష్టి పెట్టారు. శివ గ్యాంగ్ రెండేళ్లలో కనీసం రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల విలువైన బంగారు నగలు చోరీ చేసిందని విచారణలో తేలింది. దీంతో ఈ బంగారం అంతా రికవరీ చేసేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు.
ఒక్క సైబరాబాద్‌లోనే ఈ గ్యాంగ్ 700కుపైగా స్నాచింగ్‌లకు పాల్పడినట్టు నిర్థారించారు. నగర పోలీసు కమిషనరేట్‌తో పాటు రంగారెడ్డి, మెదక్ జిల్లాలలోనూ వీరు పంజా విసిరారు. ఇవన్నీ కలుపుకుంటే కనీసం వెయ్యికిపైగా నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా, రాజేంద్రనగర్ కోర్టు ఆదేశాల మేరకు నిందితులు ముగ్గురినీ కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.
విచారణలో వారు వెల్లడించిన అంశాల ఆధారంగా రికవరీ చేస్తారు. దొంగ సొమ్ము ఖరీదు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేయనున్నారు. శివ తన మకాం పోలీసులకు తెలియకుండా ఉండేందుకు తన సెల్‌ఫోన్‌ను మూడు కిలోమీటర్ల దూరంలోనే స్విచ్ఆఫ్ చేసి ఇంటికి వెళ్లేవాడని, అలాగే ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో మూడు కిలోమీటర్ల దూరం వెళ్లాక ఫోన్ ఆన్ చేసేవాడని తెలిపింది.