ఎంవీఐ శివనాగేశ్వరరావు సస్పెన్షన్
► అతనితో నాకు ఎటువంటి బంధుత్వమూలేదు
► 18న పుష్కర ఏర్పాట్లపై శ్రీశైలంలో సీఎం సమీక్ష
► పుష్కరాలకు 300 నూతన బస్సులు
► విజయవాడ పరిధిలో ఉచిత ప్రయాణం
► రాష్ట్ర రవాణాశాఖామంత్రి శిద్దా రాఘవరావు
ఒంగోలు : వాహనాల తయారీనే లేకుండా 27 వాహనాలకు అక్రమ రిజిస్ట్రేషన్లు నిర్వహించిన మోటారు వెహికల్ శివనాగేశ్వరరావును సస్పెండ్ చేయూలని రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను ఆదేశించినట్లు రాష్ట్ర రవాణాశాఖామంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. ఒంగోలులోని తన నివాస గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆయన విలేకరుల సమావేశంలో శిద్దా మాట్లాడారు. శివనాగేశ్వరరావుతో తనకు ఎటువంటి బంధుత్వం లేదన్నారు. ఆయన ఒంగోలులో ఎంవీఐగా పనిచేశారనే విషయం తప్ప అతను ఎవరో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు.
అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా సహించేది లేదని స్పష్టం చేసేందుకే శివనాగేశ్వరరావుపై తక్షణ విచారణ నివేదిక కోరానని, నివేదిక అందగానే అతనిని సస్పెండ్ చేయమని ఆదేశించినట్లు చెప్పారు. పుష్కర ఏర్పాట్లపై మూడు జిల్లాల అధికారులతో సీఎం ఈనెల 18న శ్రీశైలంలో సమీక్షిస్తారన్నారు. పుష్కరాల్లో సేవలందించేందుకు రాష్ట్రానికి 300 నూతన బస్సులు త్వరలోనే రాబోతున్నాయన్నారు.
గత గోదావరి పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరో 400 బస్సులను స్పేర్లో ఉంచుతామని, వాటి ద్వారా ఎక్కడ అవసరమైతే అక్కడకు తక్షణమే వాటిని పంపిస్తారన్నారు. విజయవాడ ప్రాంతంలో ఉచిత ప్రయాణ సౌకర్యం భక్తులకు కల్పిస్తామని పేర్కొన్నారు.
తాత్కాలిక బస్టాండ్లు, టాయిలెట్స్ ఏర్పాట్ల కోసం రూ.378 కోట్లు ఇచ్చామని, పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయన్నారు. సీనియర్ సిటిజన్లకు వర్తించే 25శాతం రాయితీకి సంబంధించి వస్తున్న ఆరోపణలపై త్వరలోనే నిర్ణయం వెలువరిస్తామని పేర్కొన్నారు. దొనకొండలో హెలికాప్టర్ల తయారీ కేంద్రం నిర్మాణ పనులు మరో నెలలో ప్రారంభం అవుతాయని, రెండేళ్లకు సంస్థ తయారీ పనులు కూడా ప్రారంభిస్తుందన్నారు. తాగునీటికి సంబంధించి జలవనరులశాఖ మంత్రితో మాట్లాడామని, దానిపై త్వరలోనే 4 టీఎంసీల విడుదలకు ఉత్తర్వులు జారీ అవుతాయని చెప్పారు. రవాణాశాఖలో అవినీతి ఎన్నో ఏళ్ల నుంచి పేరుకుపోయిందని, దానిని నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని శిద్దా రాఘవరావు పేర్కొన్నారు.