కాబోయే భార్య కోసం వెళ్లి..
► కాబోయే భార్యను చూసేందుకు వస్తుండగా ఘటన
► ఒక్కగానొక్క బిడ్డ మృతితో తల్లడిల్లిన తల్లి
మదనపల్లె(చిత్తూరు) : లారీ ఢీకొని వైఎస్ఆర్ జిల్లా యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మదనపల్లె అనపగుట్టలో ఉన్న కాబోయే భార్యను చూసేందుకు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వదిలాడు. శనివారం రాత్రి గుర్రంకొండ మండలంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి సమీపంలోని సుండుపల్లె మండలం పొలిమేరపల్లె పంచాయతీ పెద్దపల్లెకు చెందిన గురిగింజకుంట సుబ్బానాయుడి కుమారుడు శివకుమార్‌నాయుడు(20)కి మదనపల్లెలోని తన అమ్మమ్మ మనవరాలు శిరీషతో ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది.
ఈ క్రమంలో కాబోయే భార్యతో మాట్లాడి వస్తానని తన తల్లి రవణమ్మతో చెప్పి ఇంటి నుంచి మోటార్‌సైకిల్‌పై మదనపల్లెకు బయల్దేరాడు. మార్గమధ్యంలోని గుర్రంకొండ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ శివకుమార్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో స్పృ హతప్పి పడిపోయాడు. గమనించిన స్థానికులు ఘటనాస్థలంలోని సెల్ ఆ ధారంగా బాధితుని కుటుంబ సభ్యులకు, గుర్రంకొండ పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు 108 సాయంతో హుటా హు టిన మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. చికిత్స పొందుతూ సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం కన్నుమూశాడు. ఒక్కగానొక్క బిడ్డ మృతితో రవణమ్మ తల్లడిల్లి పోయి విలపించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుర్రంకొండ పోలీసులు తెలిపారు.