శివలాల్ సోదరుడిపై కన్వల్జిత్ దాడి!
బేగంపేట, న్యూస్‌లైన్: హెచ్‌సీఏ క్రికెట్ అకాడమీ డెరైక్టర్ కన్వల్జిత్ సింగ్ తనపై దాడి చేశారంటూ బీసీసీఐ ఉపాధ్యక్షుడు శివలాల్ యాదవ్ సోదరుడు వీరేందర్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరేందర్ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. వీరేందర్ యాదవ్ (41) కుమారుడు అనిరుధ్ యాదవ్ టెన్నిస్ ఆటగాడు.
జింఖానాలో వార్మప్ కోసం వచ్చిన అనిరుధ్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కన్వల్జిత్ సింగ్ చెప్పారు. దీంతో ఈ విషయాన్ని అతడు తన తండ్రి వీరేందర్‌కు చెప్పగా.. ఆయన గురువారం సాయంత్రం కన్వల్జిత్ దగ్గరికి వచ్చారు. ఈ సందర్భంగా మాటా మాటా పెరగడంతో కన్వల్జిత్.. వీరేం దర్‌పై దాడికి దిగారు. వివరాలు తెలుసుకునేందుకు వస్తే దురుసుగా ప్రవర్తిస్తూ మెడ పట్టి గెంటేశాడని, తనపై చేయి చేసుకున్నాడని... వీరేందర్ బేగంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరుడిపై దాడిని శివలాల్ తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనపై స్పందించేందుకు కన్వల్జిత్ నిరాకరించారు.