చెముడులో బినామీ బాగోతంపై విచారణ
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలపై వస్తున్న ఆరోపణల విషయంలో అటు డీసీసీబీ అధికారులు, ఇటు జిల్లా సహకార శాఖ అధికారులు తక్షణమే స్పందిస్తున్నారు. ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని రావివలస సొసైటీపై ప్రాథమిక విచారణతో పాటు 51స్టాట్యూటరీ విచారణకు ఆదేశించారు. తాజాగా ‘సాక్షి’ దిన పత్రికలో ‘చెముడులో మరో బినా మీ బాగోతం!’ శీర్షికన ప్రచురితమైన వార్తపై సంబంధిత అధికారులు స్పందించారు. సుమా రు రూ. 2 కోట్లు వరకు పక్కదారి పట్టిందని, ఇప్పటికే అక్కడ ఎంపీటీసీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ కథనాన్ని ఆధారంగా చేసుకుని తమ వైపుగా డీసీసీబీ సీఈఓ శివశంకర ప్రసాద్ ప్రాథమిక విచారణకు ఆదేశించగా, శాఖా పరంగా మరో జిల్లా సహకార అధికారి వెంకటరావు ప్రాథమిక విచారణకు ఆదేశించారు. డీసీసీబీ తరఫున సాలూరు బ్రాంచ్ ఏజీఏం సీహెచ్ ఉమామహేశ్వరావు విచారణ చేపట్టనుండగా, జిల్లా సహకార శాఖ తరఫున పార్వతీపురం డివిజనల్ రిజిస్టార్ చిన్నయ్య నేతృత్వంలో విచారణ చేయనున్నారు. వీరిచ్చే ప్రాథమిక నివేదికల ఆధారంగా స్టాట్యూటరీ విచారణ చేపట్టేందుకు నిర్ణయం తీసుకోనున్నారు.