'నిర్భయ' దోషుల లాయర్లకు షోకాజ్
న్యూఢిల్లీ: బీబీసీ డాక్యుమెంటరీలో మహిళ లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ‘నిర్భయ’ కేసు దోషుల న్యాయవాదులిద్దరికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. బీసీఐ కార్యవర్గం శుక్రవారం అర్ధరాత్రి సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఎంఎల్ శర్మ, ఏపీ సింగ్‌ల వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, అనుచితమైనవిగా ఉన్నట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. వారి వ్యవహారం కేవలం అనుచితమో, లేకపోతే న్యాయవాదులకు వృత్తిపరంగా అనుచితమో పరిశీలించి, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
వారి సమాధానంతో బీసీఐ సంతృప్తి చెందకపోతే వారి ప్రాక్టీస్ లెసైన్సును రద్దు చేసే అవకాశముందన్నారు. కాగా, బీసీఐ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సింగ్ చెప్పారు. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని సింగ్ అన్నారు. నిర్భయపై గ్యాంగ్‌రేప్ ఉదంతంపై తీసిన డాక్యుమెంటరీలో శర్మ.. యువతులు భద్రత లేకుండా బయటకి వెళ్తే రేప్ వంటి ఘటనలు జరుతాయని అన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ డ్యాక్యుమెంటరీపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ న్యాయశాస్త్ర విద్యార్థి ఒకరు ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.