షూటింగ్ లో తీవ్ర విషాదం
ముంబై: ప్రముఖ హాస్య కార్యక్రమం 'తారక్ మెహతా కా ఉల్టా ఛెష్మా' షూటింగ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ కామెడీ సీరియల్ ప్రొడక్షన్ కంట్రోలర్ అరవింద్ మర్చందే అకస్మాత్తుగా కన్నుమూయడం యూనిట్ సభ్యులందర్ని షాకు కు గురి చేసింది.
వివరాల్లోకి వెళితే....జూన్ 30 న తారక్ మెహతా కా ఉల్టా ఛెష్మా షూటింగ్ సెట్ లో ఉండగానే ముఖ్య నిర్మాణ బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్న అరవింద్ ఛాతీలో నొప్పి గా ఉందని తెలిపారు. యూనిట్ సభ్యులు అతనికి ఈనో (గ్యాస్ట్రిక్ మందు) తాగించారు. అంతలోనే తీవ్రమైన గుండెనొప్పితో కప్పకూలిపోయారు. హుటాహుటిన ఆయన్ని ఆసుపత్రి తీసుకెళ్లినప్పటికీ ఫలితంలేకపోయింది. అప్పటికే అరవింద్ తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ధృవీకరించారు. దీంతో యూనిట్ అంతా తీవ్ర దిగ్భాంతికి లోనయ్యింది. ఆయన మృతికి సంతాపంగా షూటింగ్ నిలిపివేసిన టీం ఆసుపత్రిలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించింది. నిర్మాత అసిత్ మోడీ,సహా ఇతర యూనిట్ సభ్యులు, నటీనటులు అరవింద్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.
కాగా డైలీ సీరియళ్ల టిఆర్పి రేటింగ్‌తో పోటీ పడుతూ దూసుకుపోయిన ఈ కామెడీ సీరియల్ అప్పట్లో టాప్ టెన్ లో నిలిచి ఎంతో జనాదరణపొందింది. దిలీప్ జోషి ప్రధాన పాత్ర పోషించిన ఈసీరియల్ పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.