66 మంది ఐఏఎస్‌ల కొరత
పలు శాఖల్లో పోస్టుల తగ్గింపునకు కసరత్తు 211 ఐఏఎస్ పోస్టుల కేటాయింపు 165 మంది మాత్రమే పంపిణీ
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 66 మంది ఐఏఎస్‌ల కొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు కసరత్తు చేస్తున్నారు. అరుుతే పలుశాఖల్లో ఐఏఎస్‌ల పోస్టులను తగ్గించడమే తప్ప మరో ఇప్పటికిప్పుడు మార్గం లేదని ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక, రెవెన్యూ, సాగునీటి, వవసాయ శాఖల్లో ముగ్గురు చొప్పున ఐఏఎస్లుండగా.. ఒక్కో పోస్టు చొప్పున తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. పరిశ్రమల శాఖలో కూడా భారీ పరిశ్రమలు, గనులు, పెట్టుబడులు మౌలిక వసతుల కల్పనకు వేర్వేరుగా ముగ్గురు ఐఏఎస్లుండగా.. రెండు పోస్టులకు కుదించనున్నారు. మున్సిపల్ శాఖలో రెండు ఐఏఎస్ పోస్టులుండగా ఇప్పుడు ఒక పోస్టుకే పరిమితం చేయనున్నారు.
ఇలా పలు శాఖల్లో ఐఏఎస్ పోస్టులను తగ్గించినా ఇంకా కొరత ఉంటుందని, దీన్ని అధిగమించడానికి కేంద్ర సర్వీసులో ఉన్న అధికారులను వెనక్కు రప్పించుకోవడంతో పాటు ప్రస్తుతం డిప్యుటేషన్‌పై ఉన్న అధికారులను కొనసాగించుకోవాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 211 ఐఏఎస్ పోస్టులను కేటాయించినా.. పంపిణీలో 165 మంది మాత్రమే రాష్ట్రానికి వచ్చారు. అరుుతే ఇందులోనూ 20 మంది కేంద్ర సర్వీసులో పనిచేస్తున్నారు. దీంతో అందుబాటులో ఉన్న ఐఏఎస్‌లు 145 మందికే పరిమితం అయ్యూరు. ఈ విధంగా మొత్తం 66 మంది ఐఏఎస్‌ల కొరత ఏర్పడింది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల పోస్టులు, మున్సిపాలిటీలకు కలిపి 40 మంది ఐఏఏస్‌లు అవసరం.
అలాగే సచివాలయ స్థాయి శాఖలకు 40 మంది, డెరైక్టరేట్లకు 70 మంది, వివిధ ప్రాజెక్టుల డెరైక్టర్లుగా 15 మంది ఐఏఎస్‌లు ప్రధానంగా అవసరం ఉంటుంది. ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది పంపిణీ జాబితాకు ప్రధానమంత్రి మోడీ ఆమోదం లభించిన వెంటనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ల పేర్లతో గెజిట్ నోటిఫికేషన్ జారీ కానుంది. వెనువెంటనే ఏపీ ప్రభుత్వం పోస్టుల కుదింపుతో పాటు ఐఏఎస్‌ల బదిలీలపై దృష్టి సారించనుందని అధికార వర్గాలు తెలిపాయి.