సజావుగా ‘పరీక్ష’
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మెటివ్-2 (అర్ధసంవత్సర) పరీక్షల ప్రశ్నపత్రాల కొరతపై విద్యాశాఖ అధికారులు దృష్టిసారించారు. ఈ నెల రెండున పరీక్షలు ప్రారంభం కాగా, తొలిరోజే ప్రశ్నపత్రాల కొరత ఏర్పడటం, దీనివల్ల గందరగోళం నెలకొనడాన్ని ‘ఇదేం పరీక్ష’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికారులు లోపాలను సరిదిద్ది, పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
ఇప్పటికే సమైక్య ఉద్యమం కారణంగా సిలబస్ పూర్తికాక, అక్టోబర్లో జరగాల్సిన సమ్మెటివ్-2 పరీక్షలు ఆలస్యంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికితోడు ఈ ఏడాది ప్రశ్నపత్రాలను హైదరాబాద్ నుంచి పంపించడం, అవీ అరకొరగానే ఇవ్వడంతో సమస్య వచ్చింది. 9, 10 తరతగతులకు ప్రశ్నపత్రాలు సక్రమంగానే అందాయి. రాజీవ్ విద్యామిషన్ ద్వారా 6 నుంచి 8వ తరగతి చదివే 2 లక్షల 74 వేల 115 మంది విద్యార్థుల్లో చాలామంది ప్రశ్నపత్రాల కొరత, పరీక్షలు ఆలస్యం కావడం వంటి సమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. సమస్యను గుర్తించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగి గత రెండు రోజుల్లో ప్రశ్నపత్రాల కొరత ఎక్కడెక్కడ ఉందో గుర్తించారు.
ప్రతి పాఠశాలకు ఉండే సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధుల నుంచి అవసరమైతే ప్రశ్నపత్రాలు జిరాక్స్ (ఫొటోస్టాట్) తీయించి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో తెలుగు పరీక్ష రోజున వచ్చిన ఇబ్బంది శుక్రవారం జరిగిన హిందీ పరీక్షకు కొంత తీరింది. శనివారం జిల్లాలో జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు ప్రశ్నపత్రాల కొరత లేకుండా రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ప్రాజెక్టు అధికారిణి బి.పద్మావతి చర్యలు చేపట్టారు. మిగిలిన పరీక్షలన్నీ సజావుగా జరిగేలా అవసరమైన ప్రశ్నపత్రాలు సకాలంలో అందించేలా చర్యలు తీసుకున్నట్టు ఆమె తెలిపారు.