ఇలా తెరిచారు... అలా అయిపోయాయి!
పెద్ద నోట్ల రద్దు తర్వాత తొలిరోజు ఏటీఎంలు ఇలా తెరుచుకున్నాయో లేదో.. అలా వెంటనే మూతపడ్డాయి. చాలావరకు ఏటీఎంలలో ఉదయమే నాట్ వర్కింగ్ అని, నో సర్వీస్ అని బోర్డులు వెలిశాయి. ఒకటీ అరా అక్కడక్కడ తెరుచుకున్నాయి గానీ, వాటిలో గట్టిగా పది పదిహేను మంది డబ్బులు తీసుకున్నారో లేదో.. వాటిలో డబ్బులు అయిపోయాయి. ఏటీఎం మిషన్లలో చాలావరకు వంద, యాభై రూపాయల నోట్లనే పెట్టడంతో, ఒక్కొక్కరు రెండు వేల రూపాయలు తీసుకోవడంతో అవి త్వరగానే అయిపోయాయి. మళ్లీ వాటిలో డబ్బులు నింపాలంటే ఏజెన్సీల వాళ్లకు తలప్రాణం తోకకు వస్తోంది.
ఇంకా చాలావరకు ఏటీఎంలలో సాంకేతిక సమస్యల కారణంగా అసలు ముందునుంచే పనిచేయలేదు. రెండువేల రూపాయల నోట్లు పెట్టడం, వాటిని డిస్పెన్స్ చేయడానికి సాఫ్ట్వేర్ మార్చాల్సి రావడంతో కొన్ని ఏటీఎంలు పనిచేయలేదని అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల ఏటీఎంలు ఉంటే, వాటిలో దాదాపు 50 వేల మిషన్లలో పాతనోట్లే ఉన్నాయన్నది మరో కథనం. దాంతో.. అవి కూడా పనిచేయలేదు. మొత్తమ్మీద బ్యాంకుల్లో క్యూలైన్లు పెద్దగా ఉన్నందున ఏటీఎంలో తక్కువైనా తీసుకుందామని వెళ్లినవారికి మాత్రం చుక్కలు కనిపించాయి. అసలు ఏటీఎం పనిచేస్తోందో లేదో తెలియకపోయినా చాలాచోట్ల పెద్దపెద్ద క్యూలైన్లు కనిపించాయి.
ఏటీఎంలలో నోట్లు నింపే వేగాన్ని పెంచడం, ఇంతకుముందు కంటే ఎక్కువసార్లు డబ్బులు నింపడం లాంటి చర్యల ద్వారా కొంతవరకు ఈ కష్టాలను అధిగమించే అవకాశం ఉంది. వేరే బ్యాంకు ఏటీఎంలో అయినా డబ్బులు తీసుకునే అవకాశం ఉండటంతో ఉదయం పనిచేసిన కొన్ని ఏటీఎంల వద్దకు వచ్చినవాళ్లు తమకున్న మూడు నాలుగు డెబిట్ కార్డులను ఉపయోగించి ఒక్కో దాంట్లో 2 వేల రూపాయల చొప్పున డ్రా చేసుకున్న సందర్భాలు సైతం కనిపించాయి. దానివల్లే డబ్బులు త్వరగా ఖాళీ అయిపోయాయి తప్ప డబ్బులు తక్కువ పెట్టడం కారణం కాదని కొంతమంది బ్యాంకు అధికారులు తెలిపారు. ఏది ఏమైనా పెద్దనోట్ల రద్దు కష్టాలు మరికొన్నాళ్లు తప్పేలా లేవు.