డబ్బేమైంది..!
జిల్లాకు వచ్చిన రూ.315 కోట్ల కొత్త నోట్లు
అయినా ఏటీఎంలలో డబ్బుల కొరత
గంటపాటే పనిచేస్తున్న మిషన్లు
సెలవు రోజుల్లో మూతే బ్యాంకుల్లోనూ తప్పని తిప్పలు
పాత నోట్లు రద్దయి నలభై రోజులు కావస్తున్నాయి. అధికార యంత్రాంగం కోరినదాంట్లో సుమారుగా రూ. 315 కోట్లు జిల్లాకు కొత్త నోట్లు వచ్చాయి. ఇంకా ఏటీఎంల వద్ద జనం బారులు తీరుతున్నారు. పని రోజుల్లో గంటపాటు ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో ఉండగా.. సెలవు రోజుల్లోనైతే అసలు తెరవడమే లేదు. బ్యాంకులకు వెళ్తున్న ఖాతాదారులందరికీ నిర్దేశించిన డబ్బులు కూడా అందడం లేదు. మరి జిల్లాకు వచ్చిన కొత్త నోట్లు ఏమైనట్లు..? ప్రజలకు ఇది శేష ప్రశ్నగా మారింది.
నిజామాబాద్‌అర్బన్ : కేంద్ర ప్రభుత్వం పాత రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో జిల్లాకు రూ.350 కోట్లు కొత్తవి పంపాలని అధికారం యంత్రాంగం ఆర్థికశాఖకు ప్రతిపాదించింది. ఇప్పటివరకు జిల్లాకు రూ.315 కోట్లకుపైగా కొత్తనోట్లను బ్యాంకులకు పంపిణీ చేసి నగదును అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే సామాన్య జనానికి డబ్బులు మాత్రం అందడంలేదు.. సెలవులు వస్తే ఏటీఎంలు మూత పడుతున్నాయి. పని రోజుల్లో గంటపాటు ఏటీఎంలలో డబ్బులు ఉంటున్నాయి. జిల్లాలో 356 బ్యాంకులు, 342 ఏటీఎంలు ఉన్నాయి. వివిధ బ్యాంకుల ద్వారా నగదును ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కోట్లాది రూపాయలు వచ్చినా.. సామాన్యుడికి అందకపోవడం వెనుక పక్కదారి పట్టడమే ప్రధాన కారణమంటున్నారు. బ్యాంకులలో నగదు విత్ డ్రాకు నిబంధనలు అమల్లో ఉన్నాయి. సామాన్య జనం డబ్బుల కోసం ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తున్నారు. నిత్యావసరాలు, శుభకార్యాలు, ఆరోగ్య సమస్యలు, ఇతర వ్యాపారపరంగా అవసరాలు, రైతులు పెట్టుబడికి డబ్బులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో ఏటీఎంలు మూతపడ్డాయి.
పింఛన్ల కోసం వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యలు ఇంకేన్ని రోజులు ఉంటాయోనని ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల ద్వారా రూ.10 వేల నగదు అందిస్తామన్న ప్రభుత్వ నిర్ణయం సక్రమంగా అమలు కావడంలేదు. నేటివరకూ కొందరు ఉద్యోగులకు డబ్బులు అందలేదు. బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రంగాల్లోని బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రియల్టర్లకు బ్యాంకుల నుంచి నేరుగా నోట్ల మార్పిడి జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కోట్లాది రూపాయల నోట్ల మార్పిడిలో బ్యాంకు అధికారులదే పెద్దన్న పాత్ర. నల్లధన కుబేరులు, దళారుల వ్యవహారమే కొనసాగింది. బ్యాంకుల నుంచి డబ్బులను మధ్యవర్తులు పొంది 30 శాతం కమీషన్‌తో నోట్ల మార్పిడికి తెగబుతున్నట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు, పరిశీలనలు చేపడితే ఖచ్చితంగా అక్రమాలు వెలుగులోకి వచ్చేవని జానాభిప్రాయం. కాగా జిల్లాలో నల్లధనం బయట పడకపోవడం మిస్టరీగా మారింది. అక్రమ ఆస్తులు, ఆదాయంపై ఐటీశాఖ స్పందన కనిపించడం లేదంటున్నారు.