మెరిసిన ‘రవి’కిరణం
కలెక్టర్ కావాలన్న.. తన చిన్ననాటి ఆశయం అతడ్ని ముందుకు నడిపించింది. అమ్మానాన్న, అన్న కల మార్గనిర్దేశం చేసింది. గురువుల శిక్షణ కొండంత బలాన్ని ఇచ్చింది. స్నేహితుల ప్రోత్సాహం గెలుపుపై మరింత ధీమా పెంచింది. దృఢమైన తన లక్ష్యం ముందు పేదరికం ఓడిపోయింది. ఉన్నత చదువులు చదివి తాను పుట్టినగడ్డకు ఏదో ఓ విధంగా సేవచేయాలనే సంకల్పమే విజయతీరాలకు చేర్చింది.. వెరసి పాలమూరు మట్టిగడ్డ గిరిజన బిడ్డ జెర్పుల రవి 28ఏళ్లలోనే సివిల్స్‌లో 1029వ ర్యాంకు సాధించి సత్తాచాటాడు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు.
అడ్డాకుల : మండలంలోని మారుమూల కాటవరం గిరిజనతండాకు చెందిన జెర్పుల శత్రునాయక్, లక్ష్మిల మూడో సంతానం రవి. అన్న శంకర్‌నాయక్, అక్క భాగ్యలక్ష్మి ఉన్నారు. తమకు ఉన్న ఐదేళ్ల పొలంలో పంటపండిస్తేనే వారి కుటుంబం గడిచేది. ఒకటో తరగతి తండాలోనే చదివాడు.
ఆ తరువాత ఏడో తరగతి వరకు అడ్డాకులలోని శ్రీరాఘవేంద్ర విద్యానికేతన్, పదో తరగతి వరకు కొత్తకోట ప్యూపిల్స్ స్కూల్లో విద్యనభ్యసించాడు. ఒంగోలులోని శ్రీప్రతిభ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. అప్పుడే ఐఐటీ రాయడంతో చెన్నైలో సీటు వచ్చింది. అక్కడే బీటెక్, ఎంటెక్ పూర్తిచేశాడు.
క్యాంపస్ సెలక్షన్స్‌లో ఎన్టీపీసీలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2010లో రామగుండం ఎన్టీపీసీలో ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా ఎన్టీపీసీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
శ్రమించాడు..సాధించాడు!
చెన్నై ఐఐటీలో ఎంటెక్ చేస్తున్న సమయంలో అక్కడే శంకర్ ఐఏఎస్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. అది వీకెండ్ కోచింగ్. శని, ఆదివారాల్లో మాత్రమే శిక్షణ ఇచ్చేవారు. ఛత్తీస్‌గఢ్‌కు వచ్చిన తర్వాత 2013లో మూడు నెలలు ఉద్యోగానికి సెలవు పెట్టి ఢిల్లీలో ఉన్న వజీరాం అండ్ రవి కోచింగ్ సెంటర్లో జనరల్ స్టడీస్‌పై శిక్షణ తీసుకుని సివిల్స్ పరీక్ష రాశాడు. మెయిన్స్ రావడంతో మళ్లీ ఢిల్లీకి వెళ్లి ఇక్కడే ఇంటర్వ్యూ కోసం శిక్షణ తీసుకున్నాడు. నాలుగో యత్నంలో భాగంగా ఈ ఏడాది జాతీయస్థాయిలో 1029వ ర్యాంక్ సాధించాడు.
ఐఏఎస్ కావాలన్నదే లక్ష్యం..
చిన్నప్పుడు నాన్న శుత్రునాయక్, అన్న శంకర్‌నాయక్‌లు మాకున్న ఐదెకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ నన్ను చదివించారు. ముఖ్యంగా నాన్న ప్రోత్సాహం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. పెద్ద చదువులన్నీ నగరాల్లోనే ఉండేవారు చదువుతారా..మనమెందుకు చదవ కూడదనే పట్టుదల పెరిగింది. ఒక ఉన్నతమైన లక్ష్యంతో చదివి చదివి సివిల్స్‌లో ర్యాంక్ సాధించాను. అయితే ఐఏఎస్ కావాలన్నది మాత్రం నా జీవితాశయం..తప్పకుండా ఐఏఎస్‌నవుతా. కచ్చితంగా ఎస్టీ కేటగిరిలో ఐపీఎస్ వస్తుందనే నమ్మకముంది. అది రాకపోతే ఐఆర్ఎఫ్ వస్తుంది.
-జెర్పుల రవి, సివిల్స్ 1029వ ర్యాంకర్
చాలా సంతోషంగా ఉంది..
మా రవి కలెక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి మేమంతా కష్టపడి చదివిస్తున్నాం. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. కలెక్టర్ కావాలని చదివాడు. అయితే వేరే ఉద్యోగం వస్తుందని చెప్పాడు. తర్వాత కూడా కలెక్టర్ కావాలని చదువుతానంటున్నాడు. మాకు ఐదెకరాల పొలం ఉంది. రవి ఉద్యోగం చేయడంతో వచ్చిన డబ్బుతోనే ఇళ్లు కట్టుకున్నాం. మావాడు పెద్ద ఉద్యోగానికి ఎంపికకావడం సంతోషంగా ఉంది.
- రవి తల్లిదండ్రులు, అన్నయ్య, అక్క