బ్యాడ్మింటన్ చాంపియన్ ‘తెలంగాణ’
ఖమ్మం స్పోర్ట్స్: నాలుగు రోజుల పాటు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయి మహిళా, పురుష షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు మంగళవారం ముగిశాయి. మహిళా విభాగంలో సింగిల్స్, డబుల్స్, పురుష సింగిల్స్, డబుల్స్ చాంపియన్ షిప్‌ను తెలంగాణకు చెందిన క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. విజేతలందరూ గోపీచంద్ అకాడమీకి చెందిన వారే కావడం విశేషం. ఖమ్మం జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి రుత్వికా శివాని, హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి రితు పూర్ణా దాస్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. మూడో సెట్లో రితు పూర్ణా దాస్ విజయం సాధించింది.
విజేతలు వీరే...
పురుష సింగిల్స్ విభాగంలో ఎ. ఎస్. ఎస్. సిరిల్ వర్మ (మెదక్) ప్రథమ, ఎన్. సృ జన్(చిత్తూరు) ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మహిళా సింగిల్స్‌లో రితుపూర్ణదాస్ (హైదరాబాద్) ప్రథమ, జి. రుత్వికాశివాని(ఖమ్మం) ద్వితీయ స్థానాన్ని సాధించుకున్నారు. మహిళా డబుల్స్‌లో బి. సుమీత్‌రెడ్డి, టి.హేమనాగేంద్రబాబు(రంగారెడ్డి) ప్రథమ, బి. వెంకటేష్ (శ్రీకాకుళం), కె. చైతన్యరెడ్డి(తూర్పుగోదావరి) ద్వితీయ స్థానంలో నిలిచారు.
మహిళా డబుల్స్‌లో జె. మేఘన, కె. మనీషా(హైదరాబాద్) ప్రథమ, జి. వృశాలి, రితూపూర్ణదాస్ (హైదరాబాద్) ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఫైనల్స్‌లో తలపడినవారంతా అంతర్జాతీయ క్రీడకారులే కావడం విశేషం. విజేతలకు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఓఎస్డీ రమణకుమార్, డీఎస్పీ బాలకిషాన్రావు, డీఎస్డీఓ కబీర్దాసు, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సిరిపురపు సుదర్శన్‌రావు, జూబ్లీక్లబ్ మాజీ సెక్రటరీ కె.ఈ. సత్యనారయణమూర్తి, జూబ్లీక్లబ్ సెక్రటరీ కర్నాటి వీరభద్రం, చీఫ్ రిఫరీ ఫణీరావు, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గంటావెంకట్రావు, పాటిబండ్ల యుగంధర్, కోశాధికారి ఉప్పల్‌రెడ్డి, నాయకులు కమర్తపు మురళి, వనమా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.