రూబీ సరే.. ఈ ప్రొఫెసర్లు మాములోళ్లేం కాదు!
ఆగ్రా: చదువులు చట్టుబండలయ్యాయా.. చదువుతున్నవారు.. చదువుకున్నవారు చట్టుబండలుగా మారుతున్నారా.. అనే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటు బిహార్, అటు ఉత్తరప్రదేశ్లోని పరిస్థితి చూస్తుంటే ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థులే కాదు.. పాఠాలు బోధించే పంతుల్లు అందులోనూ ఏకంగా ప్రొఫెసర్లు కూడా చట్టుబండలవుతున్నారు. బిహార్ లో తప్పుడు మార్గంలో టాపర్ గా వచ్చి ప్రస్తుతం జైలులో ఉన్న రూబీ రాయ్ పరిస్థితి ఎలా ఉన్నా ఉత్తరప్రదేశ్ లో ఈ ప్రొఫెసర్ల పరిస్థితి చూస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే.
పొలిటికల్ సైన్స్ అనే పదానికి అర్థం తెలియక పోయినా అక్రమ మార్గంలో బిహార్ టాపర్గా వచ్చి చివరకు అసలు విషయం బయటపడి ప్రస్తుతం రూబీ రాయి అనే విద్యార్థిని జైలులో ఉండగా.. ఆడిట్ అంటే అర్థం తెలియని ఓ అర్థశాస్త్ర ప్రొఫెసర్ దర్జాగా కాలర్ ఎగరేసుకొని బయట తిరుగుతున్నాడు.
అవును ఇది నిజమే.. ఉత్తరప్రదేశ్లో ఓ ఇంగ్లిష్ ప్రొఫెసర్, ఎకనామిక్స్ ప్రొఫెసర్లు చిన్నచిన్నపదాలకు కూడా అర్థం చెప్పకుండా ఆ రాష్ట్రంలో దిగజారిపోయిన విద్యావ్యవస్థను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆంగ్ల ప్రొపెసరేమో ఎవల్యూషన్ అనే పదానికి స్పెల్లింగ్ చెప్పడం రాక తికమకపడగా.. ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఆడిట్ అనే పదానికి అర్థం చెప్పలేక.. ఐఎంఎస్(ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్-అంతర్జాతీయ ద్రవ్య నిధి) పదానికి సాంకేతిక పదానికి ఒక కొత్త నిర్వచనం సృష్టించారు.
ఐఎంఎప్ అంటే ఇంటర్నేషనల్ మనీ ఫౌండ్ అంటూ కొత్త భాష్యం చెప్పారు. దీంతో అవాక్కవడం ప్రశ్నలు అడిగినవారి వంతైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్ మెంట్ కు సంబంధిచి బీఏ ఆంగ్లము, ఎకనామిక్స్ పేపర్లను దిద్దే సమయంలో వారికున్న ఈ గొప్పపరిజ్ఞానం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు వేసిన మార్కులను చూసిన కో ఆర్డినేటర్ కు అనుమానం వచ్చి వారిని ప్రశ్నించగా ఈ విషయం రట్టయింది.
కాగా, ఈ విషయంపై రాష్ట్ర గవర్నర్ను, వర్సిటీ చాన్స్లర్ ను సంప్రదించగా ఆ టీచర్ల వివరాలు మెయిల్ చేయమన్నారట. శ్యాం బహదూర్ అనే వ్యక్తి ఇంగ్లిష్ అసోసియేట్ ప్రొఫెసర్ గా మహాత్మా జ్యోతిభా పులే రోహిల్ఖండ్ యూనివర్సిటీలో పనిచేస్తుండగా.. అనిల్ కుమార్ పాల్ అనే ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ గా వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు.