సియాచిన్లో చిక్కుకుని.. సజీవంగా బయటపడి!
సియాచిన్ ప్రాంతంలో భీకరంగా వచ్చిన మంచు తుపానులో చిక్కుకుని మరణించారని భావించిన పదిమంది భారతీయ సైనికుల్లో ఒకరు సజీవంగా బయటపడ్డారు. మిగిలినవారంతా మరణిచినట్లు నిర్ధారణ అయ్యింది. సియాచిన్ ప్రాంతంలో తాము రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుండగా. లాన్స్ నాయక్ హనమంతప్ప సజీవంగా కనిపించారని, మిగిలినవాళ్లంతా దురదృష్టవశాత్తు మరణించారని జీఓసీ నార్తరన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా మంగళవారం తెలిపారు.
హనమంతప్ప ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉందని, ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని హూడా చెప్పారు. ఈనెల మూడో తేదీన సియాచిన్ ప్రాంతంలో భారీ మంచుతుపాను వచ్చి టన్నుల కొద్దీ బరువున్న మంచుగడ్డలు పడటంతో వాటి కింద పది మంది భారత సైనికులు చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వారిని గుర్తించేందుకు ఆర్మీ, ఎయిర్ఫోర్స్ ముమ్మరంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి.