ఒలింపిక్స్ కు తొలి బంగ్లాదేశీ అర్హత
ఢాకా: బంగ్లాదేశ్ కు చెందిన క్రీడాకారుడు తొలిసారి ఒలింపిక్స్ కు అర్హత సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. రియో అర్హత ర్యాంకింగ్స్ లో భాగంగా బంగ్లాదేశ్ కు చెందిన గోల్ఫర్ సిద్దికూర్ రెహ్మాన్ 56వ స్థానంలో నిలిచి ఒలింపిక్స్ కు బెర్తును దక్కించుకున్నాడు. దీంతో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి బంగ్లాదేశీగా ఘనత సాధించాడు. ఈ మేరకు అంతర్జాతీయ గోల్ఫ్ ఫెడరేషన్ విడుదల చేసిన రియో ఒలింపిక్స్ ర్యాంకింగ్స్ లో రెహ్మాన్ చోటు దక్కించుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
కాగా, బంగ్లాదేశ్ నుంచి స్మిమ్మర్లు మహిజుర్ రెహ్మాన్, సోనియా అక్తర్ తింపా, ఆర్చరీ విభాగంలో షైమోలీ రాయ్, అబ్దుల్లాహెల్ బాకీలు రియోలో పాల్గొంటున్నారు. అయితే వీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మాత్రమే రియోకు అర్హత సాధించగా, గోల్ఫర్ సిద్ధికూర్ మాత్రం ర్యాంకింగ్ ఆధారంగా ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి బంగ్లాదేశీగా నిలవడం విశేషం.
ఇదిలా ఉంగా, దాదాపు శతాబ్దం తరువాత గోల్ప్ క్రీడను ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టడం మరో విశేషం. ఒలింపిక్స్ లో గోల్ప్ ను ప్రవేశపెట్టడం ఇప్పటికి మూడు సార్లు మాత్రమే జరిగింది. తొలిసారి 1900వ సంవత్సరంలో ఈ ఆటను ప్రవేశపెట్టగా, ఆ తరువాత 1904 ఒలింపిక్స్ లో ఆ క్రీడను చివరిసారి కొనసాగించారు.