మనది.. మెట్రోదారి
►సిద్దిపేటకు ఆధునిక ‘సొబగులు’
►బీఓటీ విధానంతో బస్‌షెల్టర్స్
► పెట్టుబడి లేని శాశ్వత ఆదాయం
►సొంతగడ్డలో మంత్రి హరీష్ ప్రయోగం
ఖర్చు చేయకూడదు..కానీ ప్రయాణికుల సౌకర్యార్థం బస్షెల్టర్లు నిర్మించాలి. అంతేకాదు మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చుకోవాలి. ఇలా ఆలోచించిన మున్సిపాలిటీ అధికారులకు వెంటనే హైదరాబాద్ గుర్తుకొచ్చింది. అక్కడి అధునాతన బస్షెల్టర్లు కళ్లముందు కనిపించాయి. వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. పైసా ఖర్చుచేయకుండా కళకళలాడే బస్షెల్టర్ల నిర్మాణాలకు రూపకల్పన చేశారు. ఖజానా నింపుకునేందుకు కొత్తదారి వెత్తుకుంటున్నారు.. ఇంతకీ ఏం చేస్తున్నారం టారా... చదవండి మరి
సిద్దిపేట జోన్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) తరహాలో సిద్దిపేట మున్సిపాలిటి వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మహా నగరాలకే పరిమితమైన అధునాతన బస్షెల్టర్ల సౌకర్యాన్ని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రయోగాత్మకంగా సిద్దిపేట పట్టణంలో అమలు పరుస్తున్నారు. ఆ దిశగా బీఓటీ (బిల్ట్ ఆపరేటివ్ ట్రాన్స్ఫర్) విధానంతో పట్టణంలోని 11 ముఖ్య కూడళ్లలో సుందరమైన బస్షెల్టర్లను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సన్నద్ధమైంది.
తొలివిడతలో ఐదు చోట్ల సుమారు రూ. 6 లక్షల వ్యయంతో షెల్టర్ల నిర్మాణానికి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరికొన్ని చోట్ల ఈ బస్షెల్టర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త ఆలోచన వల్ల వాణిజ్య ప్రకటనల పన్ను రూపంలో పెట్టుబడి లేకుండానే మున్సిపాలిటీకి భారీ ఎత్తున ఆదాయం సమకూరడంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం శాశ్వత నిర్మాణాలు సమకూరనున్నాయి.
మహానగరాల్లో మాదిరిగా...
సిద్దిపేట పట్టణం జిల్లాలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీగా పేరొందింది. వ్యాపార, వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో స్వచ్ఛంద సంస్థలు, ఆర్టీసీ, ప్రజాప్రతినిధుల సహకారంతో పట్టణంలోని ముఖ్య కూడళ్లలో పురాతన పద్ధతుల్లో బస్సు షెల్టర్ల నిర్మాణం జరిగేది. ఇందుకోసం మున్సిపాలిటీ తన సొంత నిధులు ఖర్చు చేసేది. అయితే మున్సిపాలిటీ అధికారులు మహానగరాల్లో మాదిరిగా అత్యంత ఆకర్షణీయంగా, అధునాతనంగా కొత్త పద్ధతుల్లో నిర్మిస్తున్న బస్సు షెల్టర్లను సిద్దిపేటలో నిర్మించాలని భావించారు. ఈ కొత్తరకం బస్ షెల్టర్ల వల్ల మహానగరాల్లో మాదిరే ఇక్కడ కూడా ప్రముఖ యాడ్ ఏజన్సీలు టెండర్లలో బస్షెల్టర్లను కైవసం చేసుకొని తమ వ్యాపార ప్రకటనల ద్వారా మున్సిపాలిటీకి ఆదాయాన్ని అందిస్తాయని భావిస్తున్నారు.
బీఓటీ విధానం ద్వారా షెల్టర్లు
లక్ష పైచిలుకు జనాభా కలిగిన సిద్దిపేటకు నిత్యం మెదక్, నిజమాబాద్, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల నుంచి లక్ష జనాభా రాకపోకలు సాగిస్తుంటారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఆర్టీసీ బస్సులు, ఆటోలు ప్రయాణీకుల కోసం వేచి ఉంటాయి. ట్రాఫిక్ రద్దీని నియంత్రిస్తూ, ప్రయాణికులకు నీడ కల్పించే లక్ష్యంతో మంత్రి హరీష్‌రావు పట్టణంలో మెట్రో తరహాలో బస్ షెల్టర్ల నిర్మాణానికి నాంధి పలికారు. మంత్రి సూచనల మేరకు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ సంబంధిత నిర్మాణ ప్రక్రియల ప్రణాళికలు, ప్రతిపాదనలను రూపొందించారు. అందులో భాగంగానే హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ యాడ్ ఏజెన్సీ టెండర్ల ప్రక్రియకు ప్రత్యామ్నాయంగా కొనసాగే బీఓటీ పద్ధతిలో పట్టణంలో 11 చోట్ల బస్ షెల్టర్ల నిర్మాణానికి హక్కులను కైవసం చేసుకుంది.
ప్రతి షెల్టర్‌కు రూ. 5 నుంచి రూ. 5.5 లక్షల మధ్య పెట్టుబడి పెట్టి 10 నుంచి 15 సంవత్సరాల పాటు మున్సిపల్ స్థలాన్ని ప్రముఖ యాడ్ ఏజెన్సీ లీజ్‌కు తీసుకోనుంది. దీని ద్వారా ప్రతి ఏటా మున్సిపాలిటీకి ప్రకటనల పన్ను రూపంలో ఒక్కో షెల్టర్‌కు రూ. 60 వేల చొప్పున ఆదాయం సమకూరుతుంది. బీఓటీ విధానంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా మున్సిపాలిటీకి లక్షలాది ఆదాయం సమకూరడమే కాకుండా 15 సంవత్సరాల నిర్ణీత గడువు అనంతరం సంబంధిత బస్‌షెల్టర్లపై మున్సిపాలిటీకేపూర్తి హక్కులు రానున్నాయి. దీంతో పెట్టుబడి లేకుండానే దశాబ్ధ కాలం తర్వాత రూ. 60 లక్షల విలువైన నిర్మాణాలు మున్సిపాలిటీ సొంతం అవుతాయి.
తొలి విడతలో ఐదుచోట్ల నిర్మాణం
గత పక్షం రోజులుగా సిద్దిపేటలోని 11 ప్రధాన కూడళ్లను గుర్తించిన మున్సిపల్ అధికారులు, తొలి విడతలో ఐదు చోట్ల నిర్మాణాలకు ప్రముఖ యాడ్ కంపెనీకి అధికారాలు అప్పగించారు. ఈ క్రమంలోనే ముస్తాబాద్ చౌరస్తాలో రెండు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రెండు, హౌసింగ్ బోర్డు వద్ద రెండు, ఎంపీడీఓ చౌరస్తా, నర్సాపూర్ చౌరస్తా, వేములవాడ కమాన్, కోటిలింగాలగుడి వద్ద గల ఒక్కొక్క బస్ షెల్టర్లు నిర్మించేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ రమణాచారి కూడా ధ్రువీకరించారు.