మోదీ వస్తున్నారని.. రాత్రంతా నిద్రపోలేదు!
మొన్నటికి మొన్న అమెరికాలో ప్రవాస భారతీయులతో పాటు అక్కడున్న వాళ్లందరినీ తన ప్రసంగంతో, మాటల మ్యాజిక్‌తో ఉర్రూతలూగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ తన మ్యాజిక్ చూపిస్తున్నారు. సిడ్నీ ఒలింపిక్ పార్క్ లోని ఆల్ఫోన్స్ ఎరెనా ప్రాంతంలో ఆయన కోసం ఓ మెగా రిసెప్షన్ ఏర్పాటుచేశారు. దానికి ముందుగానే ప్రవాస భారతీయులలో మోదీ మానియా గట్టిగా కనిపించింది. సుమారు 20 వేల మంది వరకు ఉన్న భారతీయులు ఈ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే, లోపల స్థలం సరిపోదన్న ఉద్దేశంతో ఎందుకైనా మంచిదని నిర్వాహకులు ముందుగానే బయట కూడా పెద్దపెద్ద స్క్రీన్లు ఏర్పాటుచేశారు.
మోదీ వస్తున్నారని తెలిసి రాత్రంతా తనకు నిద్రపట్టలేదని, ఎప్పుడు ఆ కార్యక్రమం మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నానని ఓ క్యాబ్ కంపెనీ యజమాని నరీందర్ శర్మ అన్నారు. వేరే ప్రాంతాల నుంచి 'మోదీ ఎక్స్‌ప్రెస్' పేరుతో ప్రత్యేక రైళ్లు కూడా వచ్చాయి. ఆ రైళ్ల కోసం చాలామంది వచ్చినా, లోపల స్థలం సరిపోక మిస్సయ్యారు. సీటు దొరకనందుకు చాలా బాధపడ్డానని రంజన్ సింగ్ రాణా చెప్పారు. మెల్బోర్న్ వాసుల కోసం మరిన్ని ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. మెల్బోర్న్, ఇతర ప్రాంతాల నుంచి సిడ్నీకి విమానాల్లో కూడా చాలామంది బయల్దేరారు. బహుశా సిడ్నీలో ఇప్పటివరకు ఇంత పెద్ద కార్యక్రమం ఎప్పుడూ జరిగి ఉండదని అంటున్నారు. ఇప్పటివరకు మరే విదేశీ నేతకు ఇంత భారీ స్పందన లభించలేదు. ముందుగా ఇక్కడికొచ్చిన నరేంద్ర మోదీకి గిరిజన సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఆ ఫొటోలను మోదీ ట్విట్టర్లో కూడా షేర్ చేశారు.