నడిస్తే.. నడవనీ
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : మహబూబ్‌నగర్ జిల్లా పాలెం బస్సు దుర్ఘటన బాధితుల ఆందోళనల నేపథ్యంలో వారం రోజులుగా రవాణా శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్‌పై దాడులు చేసి అనుమతుల్లేని బస్సులను సీజ్ చేస్తున్నారు. జిల్లా ఆర్టీఏ అధికారులు మాత్రం మొక్కుబడిగా రికార్డులుతనిఖీలు చేసి సరిపెడుతున్నారు. దీంతో గతంలో సీజ్ చేసిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రోడ్లపై యథావిధిగా తిరుగుతున్నాయి. అవేవీ ఆర్టీఏ అధికారులకు వూత్రం కన్పించటంలేదు. దాడులు నిర్వహించినట్టు రికార్డుల్లో చూపించేందుకు నామమాత్రంగా అపరాధ రుసుము వసూలు చేసి మమ అనిపిస్తున్నారు.
పది కేసుల నమోదు
గతేడాది నవంబర్‌లో పాలెం దుర్ఘటన జరిగిన వెంటనే ఆర్టీఏ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను తనిఖీలు చేశారు. జిల్లాలోనూ దాడులు నిర్వహించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులపై 90 కేసులు నమోదు చేశారు. 70 బస్సులను సీజ్ చేశారు. అలా సీజ్ చేసిన బస్సులు యథావిధిగా రోడ్లపై తిరుగుతున్నాయి. పాలెం దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలు తమ ఆందోళనను ఉధృతం చేయడంతోపాటు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు కాంట్రాక్ట్ క్యారేజీ అనుమతులు తీసుకుని స్టేజి క్యారేజీలుగా తిప్పుతూ ఆర్టీసీ ఆదాయానికి గండికొడుతున్నారని, చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉద్యమించడంతో ప్రభుత్వం దిగివచ్చింది.
నిబంధనలకు విరుద్ధం గా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అడ్డుకోవాలని ఆదేశించడంతో రవాణాశాఖ అధికారులు రాష్ట్రవ్యాప్త దాడులకు దిగారు. వారం రోజులుగా దాడులు చేస్తున్న జిల్లా అధికారులు కేవలం 10 కేసులు మాత్రమే నమోదు చేశారు. అంటే ఎంత తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారో తెలుస్తోంది. జిల్లా నుంచి 20 ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన 150 బస్సులు నిత్యం హైదరాబాద్, విశాఖపట్నం, బెంగుళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళుతున్నాయి. జిల్లా కేంద్రం ఏలూరులో 20 వరకు ప్రైవేట్ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. ఏలూరుతో పాటు భీవువరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, కొవ్వూరు నుంచి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తిరుగుతున్నాయి. జిల్లా నుంచి ప్రయాణించే ప్రైవేట్ ట్రావెల్స్‌కు ఆర్టీసీకి కూడా లేనన్ని టికెట్ బుకింగ్ సెంటర్లు ఉన్నాయి.
నిబంధనలకు పాతర
ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలకు పాతర వేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ఇష్టారాజ్యంగా టికెట్ చార్జీలు పెంచి సొమ్ము చేసుకున్నారు. అదే రీతిలో ఈ సంక్రాతి సీజన్‌ను ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. లోపాయికారీ ఒప్పందాల వల్లే ఆర్టీఏ అధికారులు మొక్కబడిగా దాడులు చేసి సరిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.