ఇక మందేస్తే ఓటు హక్కు లేనట్లే..!
న్యూఢిల్లీ: సిక్కుల 91 ఏళ్ల కిందటి చట్టానికి చేసిన మార్పులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. దీని ప్రకారం చండీఘడ్‌లోని సిక్కుల గురుద్వార్లకు జరిగే ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తులు కొన్ని కచ్చితమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని పాటించనట్లయితే ఆ సంస్థలకు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును కోల్పోతారు. ది సిక్ గురుద్వారాస్(సవరణ) చట్టం 2016 ప్రకారం ఎవరైతే తమ జుట్టును, గడ్డాన్ని ట్రిమ్ చేసుకోవడంగానీ, షేవ్ చేసుకోవడంగానీ చేస్తారో.. అలాగే మద్యం తాగడం, పొగతాగడంలాంటివి చేస్తారో వారికి గురుద్వారాలకు జరిగే ఎన్నికల్లో ఓటేసే హక్కు ఉండదు.
ఈ మేరకు పార్లమెంటులో చట్టం చేసి ఆమోదించగా దాని రాష్ట్రపతి సమ్మతి తెలిపారు. గతంలోని 1925నాటి గురుద్వారా చట్టం చట్టం ప్రకారం 21 ఏళ్లు దాటిని ప్రతి సిక్కు యువకుడు ఆయా గురుద్వార్ లకు నియమించే పరిపాలన, నిర్వహణ యంత్రాంగాలను(శిరోమణి గురుద్వారా పర్బందక్ కమిటీ-ఎస్జీపీసీ) ఎన్నుకునేందుకు ఓటరుగా నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. అయితే,గతంలో పైన పేర్కొన్న నిబంధనలు ఉండేవి కావు. తర్వాత కాలంలో ఆ కమ్యూనిటీ నుంచి డిమాండ్ ఊపందుకోవడంతో ఈ ఏడాది మార్చి 15న ఈ సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ సభలో ప్రవేశపెట్టారు. మరుసటి రోజే ఆ బిల్లు ఆమోదం పొందింది. దానికి తాజాగా రాష్ట్రపతి ఆమోదముద్ర వచ్చారు.