పెళ్లి అడ్డుకునే యత్నం, 55 మంది అరెస్ట్
సిక్కుల దేవాలయమైన గురుద్వారలో కులాంతర వివాహాన్ని అడ్డుకోవాలని యత్నించిన 55 మందిని యూకే పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం బ్రిటన్ పట్టణం లిమింగ్ టన్ స్పాలో ఉన్న గురుద్వార ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. ఆలయంలో కులాంతర (సిక్కు-ముస్లిం) వివాహం జరపడాన్ని వ్యతిరేకిస్తూ సిక్కు సంఘాలు దాదాపు 8 గంటల పాటు గురుద్వార బయట నిరసన ప్రదర్శనలు చేశాయి.
బ్రిటన్ మీడియా సంస్థల ప్రచురణల ప్రకారం.. సిక్కు-ముస్లింల వివాహాన్ని గురుద్వారలో జరపడాన్ని కొంత మంది సిక్కులు వ్యతిరేకించారు. వివాహాన్ని అడ్డుకునేందుకు కత్తులతో ఆలయానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని నిలువరించారు. కాగా గత రెండేళ్లుగా ఆలయంలో జరుగుతున్న కులాంతర వివాహాలపై స్థానిక సిక్కులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వార్ విక్ షైర్ పోలీసులు తెలిపారు. సంప్రదాయబద్దంగా సిక్కుల వద్ద ఉండే ఆయుధాలు కాకుండా మరో ఆయుధం కూడా స్వాధీనం చేసుకున్న వాటిలో ఉందని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ గురుద్వారలో జరిగిన ఆరు కులాంతర వివాహాల్లో నాలుగింటిని అడ్డుకునేందుకు సిక్కు సంఘాలు యత్నించినట్లు గార్డియన్ పత్రిక పేర్కొంది.
దీనిపై మాట్లాడిన సిఖ్ 2 ఇన్ స్పైర్, సిఖ్ యూత్ యూకే గ్రూపుల ప్రతినిథులు తాము శాంతియుతంగానే నిరసన తెలియజేసినట్లు తెలిపారు. సిక్కులు అందరూ కలిసి కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆలయంలో ఉల్లంఘించకూడదనే ఈ నిరసన చేపట్టినట్లు వెల్లడించారు. ఒప్పందం ప్రకారం గురుద్వారల్లో కులాంతర వివాహాలను అనుమతించకూడదని చెప్పారు.