రాళ్ల దాడి: 10 మంది పోలీసులకు తీవ్ర గాయాలు
ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ సమీపంలోని సిక్రి గ్రామంలో రౌడీ షీటర్ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులుపై ఆ గ్రామస్థులు రాళ్ల వర్షం కురిపించారు. ఆ దాడిలో 10 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐలు ఆజాద్ అలీ, రణబీర్ కౌర్లతోపాటు పోలీసు కానిస్టేబుళ్లను ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం... దోపిడి కేసులో రౌడీ షీటర్ పున్నా నిందితుడిగా ఉన్నాడు.
అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసుల బృందం సిక్రీకి వెళ్లింది. దాంతో ఆ గ్రామస్థులు కోపం కట్టలు తెంచుకుంది. దాంతో గ్రామస్థులంతా పోలీసులపై ముకుమ్మడి దాడికి తెగబడ్డారు. ఆ దాడిలో పోలీసులకు తీవ్ర గాయాలు అవ్వడమే కాకుండా జీపు పూర్తిగా ధ్వంసమైంది. ఆ సంఘటనపై సమాచారం అందుకును పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని జిల్లా ఎస్ఎస్పీ హెచ్ఎన్ సింగ్ వెల్లడించారు. పోలీసులపై దాడి కేసులో ఇప్పటి వరకు 13 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినట్లు వెల్లడించారు.