నల్లబ్యాడ్జీలతో ప్రదర్శన
మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి
లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు
నిజాంపట్నం : జాస్మిన్, శ్రీసాయి కుటుంబాలకు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పేర్కొన్నారు. బుధవారం గ్రామస్తులు, శ్రీసాయి స్నేహితుల ఆధ్వర్యంలో అడవులదీవిలోని గరువు గ్రామం నుంచి మెయిన్ సెంటర్ వరకూ నల్లబ్యాడ్జీలతో మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రాంతంలో ముస్లింలు, హిందువులు సోదరుల్లా కలసిమెలసి ఉంటారన్నారు. ఉద్దేశపూర్వకంగా ఘటనను తప్పుదోవ పట్టించడం వల్లే శ్రీసాయి మృతి చెందాడన్నారు. దీనివెనుక ఏదో తెలియని కుట్ర దాగిఉందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని, దీనిపై సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తొలుత జాస్మిన్, శ్రీసాయి మృతికి మౌనం పాటించి సంతాపాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.