పట్టు ఉత్పత్తికి ప్రత్యేక చర్యలు
– కేంద్ర సిల్క్ బోర్డు చైర్మన్ హనుమంతరాయప్ప
హిందూపురం టౌన్ : దేశంలో పట్టు ఉత్పత్తికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సెంట్రల్ సిల్క్ బోర్డు చైర్మన్ హనుమంతరాయప్ప పేర్కొన్నారు. పట్టణంలోని పలు ట్విస్టింగ్, రీలింగ్ యూనిట్లను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం పట్టుగూళ్ల మార్కెట్‌ను పరిశీలించి రైతులతో గిట్టుబాటు ధర లభిస్తోందా లేదా అనే అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పట్టు ఉత్పత్తి తగ్గడంతోనే చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మేకిన్ ఇండియాలో భాగంగా దేశంలో పట్టు ఉత్పత్తి పెంచడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ట్విస్టింగ్, రీలింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం కోసం 75 శాతం సబ్సిడీ అందిస్తోందన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి షెడ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్భంగా కల్లూరుకు చెందిన రైతు చెన్నకేశవ షెడ్ల నిర్మాణం కోసం అందించే రూ.80 వేలు చాలా తక్కువగా ఉందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఎక్కువ మొత్తం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సిల్క్ కాలనీలో రీలింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో జేడీ అరుణకుమారి, ఏడీ నాగరంగయ్య, ప్రసాద్, శాస్త్రవేత్తలు మనోహర్‌రెడ్డి, సత్యనారాయణ, ఉమేష్, సిబ్బంది పాల్గొన్నారు.