దేశంలో ప్రతి సాగుభూమికీ నీరు
త్వరలో ప్రధానమంత్రి గ్రామ సించాయీ యోజన ప్రారంభం
పాట్నా: వ్యవసాయానికి మరింత ఊతమిచ్చే దిశగా దేశవ్యాప్తంగా ‘ప్రధాన మంత్రి గ్రామ సించాయీ యోజన’ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘‘దేశంలోని ప్రతి పంట భూమికీ సాగునీరు అందించాలన్న లక్ష్యంతోనే ఈ సించాయీ యోజన(సాగునీటి పథకం) ప్రవేశపెడుతున్నాం. సాగునీరు అందుబాటులో లేకపోతే వ్యవసాయ దిగుబడులు పెంచడం సాధ్యంకాదు. పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలన్న దానిపై ప్రణాళిక రచిస్తున్నాం’’ అని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ శనివారమిక్కడ చెప్పారు. ‘‘భూసారాన్ని బట్టి కూడా దిగుబడులు ఆధారపడి ఉంటాయి.
భూమి సారవంతమైనదైతే అత్యధిక దిగుబడులు సాధించడం సాధ్యమే. ఈ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులుకు ఈ పథకం కింద త్వరలోనే భూ సార కార్డులు జారీచేయనుంది. భూ సారాన్ని పరీక్షించేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థుల సాయం తీసుకుంటాం’’ అని వివరించారు. భూసారాన్ని బట్టి ఆ భూమిలో ఎలాంటి పంటలు వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేయడం ద్వారా రైతుకు తోడ్పడవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశంలోని 14 కోట్ల హెక్టార్ల వ్యవసాయ యోగ్యమైన భూమిలో 44 శాతానికే సాగునీరు అందుతోంది. మిగతా చోట్ల వర్షాలే ఆధారం.