సింగన్నగూడలో మద్యనిషేధం
తాగినా, అమ్మినా జరిమానా
గాంధీ జయంతి సందర్భంగా నిర్ణయం
గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించిన ఎస్ఐ
ములుగు: సంపూర్ణ మద్యనిషేధం దిశగా సింగన్నగూడ అడుగులు వేసింది. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ములుగు మండలం సింగన్నగూడ వాసులు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. మద్యం మానేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో మద్యాన్ని అమ్మినా, తాగినా లక్ష రూపాయల జరిమానా విధించాలని స్థానికులు గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానం చేశారు.
తీర్మానాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు ఎస్ఐకి రాతపూర్వకంగా వినతిపత్రాన్ని అందజేశారు. మద్యానికి దూరంగా ఉంటామని ఎస్ఐ శ్రీశైలం స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు అమృతవీణ, సర్పంచ్ అనీల, నాయకులు బాలకృష్ణ, భాస్కర్, స్వామిగౌడ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.