ప్రముఖ గాయకుని కొడుకు కాంగ్రెస్లోకి
ముంబై: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు మొహమ్మద్ రఫీ కొడుకు శుక్రవారం కాంగ్రెస్ తీర్థంపుచ్చుకున్నారు. రఫీ కుమారుడు షాహిద్ మొహమ్మద్ రఫీ(52) శుక్రవారం హస్తం పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఈ కార్యక్రమం ముంబైలో ఈ రోజు అట్ట హాసంగా జరిగింది. రాహుల్.. రఫీకి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అయితే షాహిద్ రఫీ ముంబై లో ఎఐఎంఐఎం తరపున ఎమ్మేల్యేగా పోటీ చేశారు. ముస్లింలు అధిక సంఖ్య లో ఉన్న ముంబాదేవి నియోజకవర్గంనుంచి పోటీ చేసి ఓడిపోయారు. తన తండ్రి ప్రజలకు చాలా సహాయం చేసేవారన్నారు. ఆయనలాగే తాను కూడా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నానన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నపుడే చేరువకాగలుగుతామని, మరింత సేవ చేసే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
కాగా బాలీవుడ్ లెంజెండరీ గాయకుడు మొహమ్మద్ రఫీ తెలుగులో ఆరాధన, భలే తమ్ముడు తదితర సినిమాల పాటల ద్వారా సినీ సంగీత అభిమానులకు సుపరిచితుడు.