పదేళ్లు ప్రధానిగా నరేంద్ర మోడీ!
నరేంద్ర మోడీ పదేళ్ల పాటు ప్రధాని పీఠంపై కొనసాగుతారా. భారత్-పాకిస్థాన్ భాయి భాయి అంటూ చేతులు కలుపుతాయా. హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టిస్తారా. అంటే అవుననే అంటున్నారు ప్రముఖ కన్సల్టెంట్ విమల్ సింగ్. 41 ఏళ్ల విమల్ భవిష్యత్ గురించి చెప్పడంలో దిట్ట. పలు కార్పొరేట్ కంపెనీలు, ప్రముఖులకు ఆయన కన్సల్టెంట్ గా ఉన్నారు. గోరఖ్పూర్ నుంచి మూడుసార్లు పార్లమెంట్ కు ప్రాతినిథ్యం వహించిన సింగసాన్ సింగ్ మనవడే ఈ విమల్. 14 ఏళ్ల వయసు నుంచే ముందు జరగబోయే వాటి గురించి చెప్పేవాడు విమల్. అతడు చెప్పేవి నిజమవుతుండడంతో విమల్ ను తాత ప్రోత్సహించారు.
విమల్ సింగ్ చెప్పిన చాలా విషయాలు తర్వాతి కాలంలో నిజమయ్యాయి. మొదటిసారి ప్రధాని పదవిని చేపట్టి 13 రోజులకే అధికారం కోల్పోయిన అటల్ బిహారి వాజపేయిని కలిసి విమల్ భవిష్యత్ చెప్పారు. పూర్తికాలం ప్రధానిలో కొనసాగే రోజు వస్తుందని వాజపేయికి విమల్ చెప్పిన జోస్యం తర్వాత కాలంలో నిజమైంది. దేశాన్ని ముందుకు నడిపిస్తారని 1997లో మన్మోహన్ సింగ్ ను కలిసి చెప్పారు. ఆ సమయానికి మన్మోహన్ సింగ్ ప్రజాదరణ ఉన్న నాయకుడు కూడా కాదు. కాని విమల్ చెప్పిన మాట అక్షరాల సాకారమైంది. పదేళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశాన్ని ముందుకు నడిపారు. కార్గిల్ యుద్ధం వస్తుందని కూడా విమల్ ముందే ఊహించారు.
ఇటీవల ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ పదేళ్ల పాటు ఆ పదవిని కాపాడుకుంటారని తాజాగా విమల్ సింగ్ జోస్యం చెప్పారు. హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్షరాలు అవుతారని అన్నారు. ఐరోపా ఖండంలోని దేశాల ఉమ్మడి కరెన్సీ 'యూరో' మాదిరిగా భారత్-పాకిస్థాన్ కలిసి ఒకే కరెన్సీని రూపొందించుకుంటాయని అంటున్నారు. భారత్-పాక్ చేతులు కలుపుతాయని, ఐఎస్ఐ ప్రాభవం తగ్గుతుందని భవిష్యవాణి వినిపించారు. మూడో ప్రపంచ యుద్ధం రాదని భరోసాయిచ్చారు.
మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కుదేలైన కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని, పార్జీలో చేరాలంటూ ప్రియాంక గాంధీపై ఒత్తిడి కొనసాగుతుందని విమల్ సింగ్ జోస్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా తగ్గి జాతీయ పార్టీలు పాగా వేస్తాయని ఊహించారు. దేశంలో రెండు మూడు పార్టీలు మాత్రమే ఉండే పరిస్థితి మళ్లీ వస్తుందని భవిష్యత్ చెప్పారు. విమల్ సింగ్ భవిష్యవాణి ఎంతవరకు నిజమవుతుందో కాలమే చెబుతుంది.