‘ఏకగ్రీవ’ నజరానా ఏదీ..?
భువనగిరి : గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన స్థానాలకు ఇస్తామన్న నజరానా నేటి కీ అందలేదు. ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహక బహుమతి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో పాలకవర్గాలు ఉన్నాయి. సంవత్సరన్నర కాలంగా నగదు బహుమతి కోసం ఎదురుచూస్తున్న సర్పంచ్లకు నిరాశే మిగులుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దంపట్టే విధంగా ఉందని ఏక గ్రీవ పంచాయతీల సర్పంచ్లు, ప్రజలు వాపోతున్నారు. గ్రామ పంచాయితీలకు రూ. 5 నుంచి రూ.7లక్షల వరకు ఒక్కో పంచాయతీకి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా గల 1169 గ్రామపంచాయతీల్లో 103 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 2013 జూలైలో మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు.
ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రోత్సాహక బహుమతిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఏకగ్రీవ పంచాయతీలకు రూ.7.21కోట్లు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇంతవరకు ఆ నిధుల జాడేలేకపోవడంతో సర్పంచ్లు పాలకవర్గ సభ్యులువాటి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఏకగ్రీవ నిధులు వస్తే తమ గ్రామాల్లో మరిన్ని అభివృద్ధిపనులు చేసుకోవచ్చని సర్పంచ్లు భావించారు. ఏడు లక్షల రూపాయలు వస్తే తమ పంచాయతీల్లో మంచినీరు, మురికికాలువల నిర్మాణంతోపాటు వీధిలైట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. నిధుల కోసం ఎన్నిసార్లు అధికారులను అడిగినా ఎవరి నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ప్రకటించిన నగదు బహుమతిని ప్రోత్సహించాలని సర్పంచ్లు కోరుతున్నారు.
డివిజన్ సర్పంచ్లు ఏకగ్రీవం
భువనగిరి 337 32
నల్లగొండ 203 05
సూర్యాపేట 253 16
మిర్యాలగూడ 225 09
దేవరకొండ 151 11
మొత్తం 1169 103