ఏకకాలంలో మున్సి‘పోల్స్’
♦ పురపాలక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
♦ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు
♦ ఈ నెల 17న అచ్చంపేట మున్సిపాలిటీకి రిజర్వేషన్ల వెల్లడి
♦ ఈ మూడింటితోపాటే సిద్దిపేట, కొల్లాపూర్, దుబ్బాక, మేడ్చల్ ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: న్యాయపరమైన చిక్కులతో వాయిదా పడిన పురపాలికల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, అచ్చం పేట, కొల్లాపూర్, దుబ్బాక, మేడ్చల్ మున్సిపాలిటీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహించాలని సీఎం కేసీఆర్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో పురపాలక శాఖ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 58 డివిజన్లు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లోని 50 డివిజన్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను ప్రకటించింది.
ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అచ్చంపేట మున్సిపాలిటీలోని వార్డు స్థానాలకు రిజర్వేషన్లను ఈ నెల 17న ప్రకటించనున్నారు. దీంతో ఈ 3 పురపాలికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ జారీ చేసే అవకాశాలున్నాయి. అయితే కొద్దిగా ఆలస్యమైనా ఈ మూడు పురపాలికలతోపాటే సిద్దిపేట, కొల్లాపూర్, మేడ్చల్, దుబ్బాక మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా న్యాయపరమైన చిక్కులు తొలగించాలని సీఎం ఆదేశించారు. దీంతో అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలపై స్టే తొలగింపు కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది.
అలాగే కొల్లాపూర్, దుబ్బాక ఎన్నికలపై సైతం స్టే తొలగింపు కోరుతూ మంగళవారం పిటిషన్లు దాఖలు చేసేందుకు పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. మేడ్చల్ మున్సిపాలిటీ ఎన్నికలపై స్టే తొలగింపు కోసం గతంలో దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఈ అంశంపై హైకోర్టు అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డితో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నెల 20లోగా కోర్టు స్టే తొలగిన మున్సిపాలిటీలకు గ్రేటర్ వరంగల్, ఖమ్మం, అచ్చంపేటలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 20న ఎన్నికల ప్రకటన జారీ చేసి వచ్చేనెల 5న ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. అవసరమైతే ప్రతిపాదిత షెడ్యూల్ను ఒకట్రెండు రోజులు ముందుకు జరిపే అవకాశాలున్నాయి.