శిరీషను హింసించారు
రాజీవ్–శ్రవణ్ అమానుషంగా ప్రవర్తించారని నిర్ధారించిన పోలీసులు
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో నిందితులుగా ఉన్న శ్రవణ్, రాజీవ్ ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించారని పోలీసులు నిర్ధారించారు. కుకు నూర్‌పల్లి నుంచి హైదరాబాద్ వచ్చే మార్గంలో ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తిం చడం, దాడి చేయడం, కొట్టడం తదితర చర్యల కు పాల్పడినట్లు తేల్చారు. ఈ నేపథ్యంలో నిందితులపై తొలుత నమోదు చేసిన ఐపీసీ 306, 109 సెక్షన్లకు తోడు 324, 354, 509 సెక్షన్లను అదనంగా చేర్చారు. రాజీవ్–శ్రవణ్ కస్టడీ గడువు మంగళవారంతో ముగిసింది. నిందితులిద్దరినీ బుధవారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచాలని అధికారులు నిర్ణయించారు.
వచ్చేప్పుడు ఏం జరిగింది..?
మంగళవారం నిందితుల రెండోరోజు విచార ణలో కుకునూర్‌పల్లి నుంచి హైదరాబాద్ వచ్చే సమయంలో జరిగిన ఘటనలపైనే దృష్టి సారించారు. మార్గమధ్యంలో శిరీష కారు నుంచి ఎందుకు దూకాలనుకుంది..? ఆమెను ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అన్న అంశాలపై నిందితుల నుంచి పోలీసులు సమాచారం రాబట్టారు. శిరీషపై కుకునూర్‌పల్లిలో ఎస్సై ప్రభాకర్‌రెడ్డి అనుచిత ప్రవర్తన, తిరిగి వచ్చే సమయంలో శ్రవణ్, రాజీవ్ ఆమెను అవమానిస్తూ కొట్టడం, ఇక రాజీవ్ తనను వదిలిం చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు శిరీష తెలుసు కోవడం తదితర పరిణామాల నేపథ్యంలో శిరీష ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు నిర్థారణకు వచ్చారు.
కుకునూర్‌పల్లి ఎస్సై క్వార్టర్స్‌లో శిరీషపై అత్యాచారయత్నం జరిగినప్పుడు శ్రవణ్, రాజీవ్ అక్కడే ఉన్నారా? ఎక్కడికైనా వెళ్లారా? అనేది లోతుగా ఆరా తీశారు. నిందితులు తాము ఆ సమయంలో క్వార్టర్స్ బయటే ఉన్నామని చెప్పినట్లు తెలిసింది. ఆర్జే ఫొటోగ్రఫి స్టూడియోలో సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్న పోలీసులు నిందితుడు చెప్పిన వివరాలు, సమయం కరెక్టుగా ఉందో లేదో అన్నది క్రైమ్ సీన్ రీ–కనస్ట్రక్షన్ ద్వారా నిర్థారించాలని నిర్ణయించారు.
తేజస్విని వాంగ్మూలం నమోదు
శిరీషను తీవ్రంగా అవమానించినట్లు ఆరోపణ లు ఎదుర్కొంటున్న రాజీవ్ ప్రియురాలు తేజస్విని వాంగ్మూలాన్ని కూడా పోలీసులు మంగళవారం రికార్డు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం గచ్చిబౌలిలోని తేజస్విని నివసిస్తున్న ప్రాంతానికి వెళ్లి అక్కడే వాంగ్మూలం తీసుకున్నారు. పోలీసు విచార ణలో తేజస్విని ఈ ఆత్మహత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు తెలిసింది. శిరీష ఆత్మహత్య తనను చాలా కల చి వేసిందని, ఆమె తన కుటుంబం విషయం ఆలోచించి.. ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేదని పేర్కొన్నట్లు సమాచారం. శిరీష ఆత్మహత్య విషయం 13న తెలిసిందని, ఆ సమయంలో తాను విజయవాడలో ఉన్నానని చెప్పినట్లు తెలిసింది. శిరీష ఆత్మహత్య చేసు కుందని తెలియగానే కన్నీరుమున్నీరయ్యానని.. సాటి మహిళగా చాలా బాధపడ్డానని పోలీసులకు తెలిపింది. తాను రాజీవ్‌ను ప్రేమించిన విషయం వాస్తవమేనని, పెళ్లి చేసుకోవాలనుకున్నానని అయితే రాజీవ్–శిరీష సన్నిహితంగా ఉండటం తనకు నచ్చలేదని వాపోయినట్లు తెలుస్తోంది.
తమ ప్రేమకు అడ్డుగా ఉందన్న ఉద్దేశంతో పలుమార్లు శిరీషడ ను తమ మధ్య నుంచి తప్పుకోవాలని చెప్పిన మాట వాస్తవమేనని.. తన స్థానంలో ఎవరు న్నా అలాగే చేస్తారని విచారణలో తేజస్వి ని పేర్కొన్నారు. 12న తాను విజయవాడ వెళ్లి రాజీవ్ తల్లిని కలిశానని, అయితే పెళ్లి ప్రస్తావన మాత్రం తీసుకురాలేదని, రాజీవ్‌తో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పానని పేర్కొన్నట్లు సమాచారం. విజయవాడ నుంచి తాను తన ఇంటికి వచ్చేశానని, తెల్లవారిన తర్వాత శిరీష ఆత్మహత్య విషయం తెలుసుకున్నానని చెప్పిన ట్లు తెలుస్తోంది. తనకు రాజీవ్ ఫేస్బుక్లో పరిచయం కాగా.. కొద్దిరోజుల్లోనే ప్రేమకు దారి తీసిందని.. అతడు తనను పెళ్లి చేసుకుం టానని చెప్పడంతో నమ్మానని వెల్లడించినట్లు సమాచారం. గత నెల 30న అనివార్య కారణాల నేపథ్యంలో రాజీవ్, శిరీషపై ఫిర్యాదు చేయడానికి తాను బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చినట్లు తేజస్విని పోలీసుల ఎదుట అంగీకరించింది.
ఫోరెన్సిక్ నివేదిక కోసం చూస్తున్నాం..
శిరీష వ్యవహారంపై పశ్చిమ మండల డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘శిరీషది ముమ్మాటికీ ఆత్మహత్యే. ఆమె వస్త్రాలతో పాటు ఫోరెన్సిక్ డాక్టర్లు సేకరించిన నమూనాలను పరీక్షల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపాం. ఆ నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం. ఫోరెన్సిక్ పరీక్ష రిపోర్ట్ వస్తే ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అనేది అధికారికంగా, స్పష్టంగా చెప్పగలం. కుకునూర్‌పల్లిలో జరిగిన ఉదంతం నేపథ్యంలోనే మనస్తాపంలో శిరీష ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నాం’ అని చెప్పారు.