అమ్మా..మేమేం పాపం చేశాం!
- ఇద్దరు శిశువుల ఆక్రందన
- తల్లిదండ్రులు ఆధారాలతో వచ్చి తీసుకెళ్లాలని
ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం సూచన
కర్నూలు(హాస్పిటల్): ‘అమ్మా...మేమేమి మీకు అన్యాయం చేశాం. మమ్ముల్ని ఇలా వదిలేసి వెళ్లిపోయారు. మేము మీకు ఎలా భారమయ్యాము. ఆడపిల్లలమని వదిలేశారా..? అమ్మా మీరు కూడా ఆడవారే కదా.. మమ్మల్ని కరుణించి ఇంటికి తీసుకెళ్లండి ప్లీజ్’ అని దీనంగా వేడుకుంటున్నట్లుగా ఉంది కర్నూలులోని శిశుగృహలో ఉన్న ఇద్దరు చిన్నారుల దీనగాథ. ఈ ఇద్దరు శిశువులకు శిశుగృహ మేనేజర్ మెహతాజ్ పేర్లు పెట్టారు. లక్ష్మీదేవి అనే 16 రోజుల శిశువును గత నెల 29వ తేదీన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగంలో ఉన్న ఎన్ఐసీయూ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. పాప బరువు తక్కువగా ఉంది. గొంతు వద్ద వాపు వచ్చింది. దీంతో అక్కడి వైద్యులు వైద్యులు పాపకు తగిన వైద్యం చేసి శిశుగృహకు తరలించారు.
మరో పాప శారదకు 18 నెలలు. ఈ పాపను గత నెల 30వ తేదీన స్థానిక బళ్లారిచౌరస్తా సమీపంలోని ఓ వైన్‌షాప్ వద్ద ఓ వ్యక్తి పూటుగా మద్యం తాగి అనుమానస్పదంగా ఎత్తుకుని తిరుగుతుంటే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పాపను సీఐ నాగరాజరావు శిశుగృహహ అధికారులకు అప్పగించారు. వీరిద్దరినీ తగిన ఆధారాలతో గుర్తించి తల్లిదండ్రులు తీసుకెళ్లాలని, లేకపోతే 30 రోజుల తర్వాత సీడబ్ల్యుసీ తీర్మానం ద్వారా అనాథలుగా నిర్ణయించి, చట్టపరంగా దత్తత కోసం ఆన్లైన్లో కోరిన దంపతులకు సీనియారిటీ ప్రకారం ఇస్తామని ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం శుక్రవారం తెలిపారు.