‘సమగ్ర సర్వే’ను ఆపండి!
హైకోర్టులో ఓ గృహిణి పిటిషన్.. నేడు విచారణ
గణాంకాలు సేకరించాలంటే నోటిఫికేషన్ తప్పనిసరి
సర్కార్ ఇప్పటిదాకా నోటిఫికేషన్ ఇవ్వలేదు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఈ నెల 19న తలపెట్టిన సమగ్ర కుటుంబ, ఆర్థిక, సామాజిక సర్వేను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గణాంకాల సేకరణ చట్టం 2008కి విరుద్ధంగా ఉన్న ఈ సర్వేను నిర్వహించకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైదరాబాద్కు చెందిన గృహిణి సీతాలక్ష్మి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్పుర్కర్ విచారించనున్నారు.
గణాంకాల సేకరణ చట్టం 2008, గణాంకాల సేకరణ నిబంధనలు 2011 ప్రకారం ఆర్థిక, భౌగోళిక, సామాజిక, పర్యావరణ అంశాల్లో గణాంకాలు సేకరించాలనుకుంటే, చట్టప్రకారం గెజిట్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయాలని, దీంతో ప్రజలు అందుకు సిద్ధంగా ఉంటారని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం 19న తలపెట్టిన సమగ్రసర్వే కోసం ఇప్పటి వరకు ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదన్నారు.
ఆదాయపు పన్ను, బ్యాంకింగ్, భీమా, పౌరసత్వం తదితర సమాచారాన్ని, గణాంకాలను రాష్ట్రం సేకరించడానికి వీల్లేదని, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విషయాలని పిటిషనర్ తెలిపారు. 19న నిర్వహిస్తున్న సమగ్ర సర్వేకు ప్రజానీకం సిద్ధంగా ఉండాలని, ఆ రోజున సెలవుదినంగా ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం పత్రికల ద్వారా తెలియచేసిందన్నారు.
దేశంలో ఎక్కడైనా తిరిగేందుకు తనకు రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛను తెలంగాణ ప్రభుత్వం ఈ సర్వే పేరుతో హరిస్తోందన్నారు. అందుకని ఈ సర్వేను నిలిపివేసేలా అధికారులను ఆదేశించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.