భార్య కాపురానికి మనస్తాపంతో భర్త ఆత్మహత్య
మహబూబ్‌నగర్: జిల్లాలోని వీపనగండ్ల మండలపరిధిలోని మియాపూర్ గ్రామానికి చెందిన సీతాపురం రాముడు(40) అనే వ్యక్తి భార్య కాపురానికి రాలేదని శనివారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. నిప్పంటించుకున్న అతన్ని చికిత్స నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి వాహనంలో తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
18 ఏళ్ల క్రితం కొల్లాపూర్‌కు చెందిన శ్యామల అనే మహిళతో రాముడుకు వివాహం జరిగింది. ఏడేళ్లుగా భార్య కాపురానికి రాకుండా తన స్వగ్రామంలో ఉండటంతో శనివారం ఉదయం భర్త కొల్లాపూర్ వెళ్లి గొడవ పడినట్లు, అదే క్రమంలో మనస్తాపానికి గురైన అతను ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై జి.రవిబాబు ఆస్పత్రికి వెళ్లి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.