'సహజ సంపదలు తెలంగాణకే సొంతం'
భద్రాచలం: ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి సహజ సంపదలు ఒక్క తెలంగాణలోనే ఉన్నాయని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని శనివారం ఆయన దర్శించుకున్నారు. అపార సహజ సంపద, గోదావరి, కృష్ణా జలాలు రాష్ట్రం సొంతమన్నారు. పనినే దైవంగా భావించే కార్మికులు మరెక్కడా లేరన్నారు. భగవంతుడైన రాముడు మానవ రూపంలో సుపరిపాలన అందించి, రామరాజ్యాన్ని స్థాపించారని గుర్తు చేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కూడా రామరాజ్యం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజల నమ్మకాలకు అనుగుణంగా సుపరిపాలన సాగాలని భద్రాద్రి రామయ్యను కోరుకున్నట్లుగా తెలిపారు. భద్రాచలం వచ్చిన స్పీకర్ మధుసూదనాచారికి నియోజకవర్గ ఇన్చార్జి మానె రామకృష్ణ, ఆ పార్టీ సీనియర్ నాయకులు తిప్పన సిద్దులు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. భద్రాచలం సీఐ సారంగపాణి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.