స్త్రీ ‘అ’శక్తి భవనాలు
ఉదయగిరి/దుత్తలూరు, న్యూస్‌లైన్: స్వయం సహాయక సంఘాల కార్యకలాపాల కోసం మండల స్థాయిలో నిర్మించతలపెట్టిన స్త్రీశక్తి భవనాలకు గ్రహణం పట్టింది. భవనాలు మంజూరై రెండేళ్లయినా ఇంకా నిర్మాణాలు పూర్తికాకపోగా, మరికొన్ని చోట్ల ప్రారంభానికి నోచుకోలేదు. పలు మండలాల్లో పనులే ప్రారంభించలేదు. జిల్లాలో 46 స్త్రీశక్తి భవనాలను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అయితే నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట పట్టణాలు మున్సిపాల్టీలుగా మారడంతో 33 భవనాలు మంజూరయ్యాయి. ఒక్కో భవన నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరైంది. కొన్ని మండలాల్లో పనులు జరుగుతుండగా, మరికొన్ని చోట్ల పనులు ప్రారంభం కాలేదు. స్వయం సహాయక
సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) కార్యకలాపాలకు సంబంధించిన సమావేశాలకు వేదికగా ఈ భవనాలు నిర్మిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలుచోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో దుత్తలూరు, వింజమూరు మండలాల్లో మాత్రమే భవనాలు పూర్తయ్యాయి. కొండాపురం, కలిగిరి మండలాల్లో అసలు పనులే ప్రారంభించలేదు. జలదంకి మండలంలో నత్తనడకన పనులు సాగుతున్నాయి. వరికుంటపాడు, సీతారామపురం, ఉదయగిరి మండలాల్లో నిర్మాణంలో ఉన్నాయి. జిల్లాలో అనేక చోట్ల ఇదే పరిస్థితి. కొన్ని మండలాల్లో స్థలం దొరకలేదని అధికారులు నిర్మాణాలను మరిచారు. రెండేళ్ల నుంచి స్థలం చూసే పనిలోనే అధికారులు కాలయాపన చేస్తుండటంతో ఈ భవనాల నిర్మాణంపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. వింజమూరులో స్త్రీశక్తి భవనం నిర్మాణం పూర్తయినా ఇంకా అద్దె భవనాల్లోనే కొనసాగించడం విచిత్రంగా ఉంది. జిల్లాలో పూర్తయిన అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.
నిధులున్నా నిర్లక్ష్యం:
ఈ భవనాల మంజూరుకు నిధులు విడుదలయ్యాయి. గత ఏడాది మేలో కలెక్టర్ స్త్రీశక్తి భవనాల నిర్మాణంపై స్పష్టమైన ఆదేశాలిచ్చినా ఇంతవరకు దాని గురించి అధికారులు శ్రద్ధ వహించలేదు. ప్రస్తుత కలెక్టర్ స్త్రీ శక్తి భవనాల నిర్మాణంపై దృష్టిపెట్టకపోవడంతో అధికారులు కిమ్మనకుండా ఉన్నారు. కాంట్రాక్టర్లు భవనాల నిర్మాణ పనుల్లో తీవ్రంగా జాప్యం చేస్తున్నారు. అనేకచోట్ల ఇప్పటికే అధికారులు ఎక్కువ మొత్తంలో కాంట్రాక్టర్లకు అడ్వాన్సు చెల్లించినట్టు సమాచారం. ఈ నిధులు దిగమింగిన కాంట్రాక్టర్లు చేద్దాంలే, చూద్దాంలే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. పైగా కొంతమంది కాంట్రాక్టర్లు రూ.25 లక్షలతో భవనాన్ని పూర్తిచేయలేమని, అదనంగా మరో రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సమయానికి పూర్తి చేసి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. కేవలం అధికారుల నిర్లక్ష్యం మూలానే ఇప్పుడు మళ్లీ అంచనా విలువ పెంచాల్సిన పరిస్థితి నెలకొంది.
త్వరలోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం
-రాములు, ఎస్ఈ, పంచాయతీరాజ్ శాఖ
జిల్లాలో ఇప్పటి వరకు ఐదు భవనాలు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. దీనికి కారణం రూ.25 లక్షలతో భవనాన్ని నిర్మించలేమని కాంట్రాక్టర్లు నిస్సహాయత వ్యక్తం చేయడమే. అదనంగా రూ.7 లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపాం. ఆ నిధులు త్వరలో విడుదల అవుతాయని ఆశిస్తున్నాం.