నిమిషం దాటినా రానివ్వరు!
♦ ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
♦ నేటినుంచి 21వ తేదీ వరకు ఎగ్జామ్స్
♦ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు..
♦ పరీక్షా కేంద్రాలు: 244
♦ హాజరుకానున్న విద్యార్థులు: 2,24,987
♦ సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు : 8
♦ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు : 6
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇంటర్మీడియెట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 21 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లాలోని 244 కేంద్రాల్లో 2,24,987 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో మొదటి సంవత్సరానికి సంబంధించి 1,10,937 మంది, రెండో సంవత్సరానికి సంబంధించి 1,14,050 మంది ఎగ్జామ్స్కు హాజరుకానున్నారు.
భయపెడుతున్న ‘నిమిషం’..
ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 8.30 గంటల వరకు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 8.30గంటల నుంచి 8.45గంటల మధ్య కాలంలో విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 8.45గంటలు దాటిన తర్వాత విద్యార్థులకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు చెబుతున్నారు.
సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో..
ఇంటర్మీడియెట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో మౌలికవసతులు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్ష సమయంలో కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించేందుకు ఎనిమిది సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పనిచేస్తాయి. ఈ బృందాల్లో పోలీసుల అధికారులతోపాటు ఇంటర్మీడియెట్ బోర్డు అధికారుల, రెవెన్యూ అధికారులు, సిబ్బంది సభ్యులుగా ఉన్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను సకాలంలో చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపాల్సిందిగా జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.