గుండెపోటు వంశపారంపర్యమా...?
నా వయసు 44 ఏళ్లు. మా నాన్నగారు తన 58వ ఏట హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. ఇది వంశపారంపర్యంగా వస్తుందా? రాకుండా నివారించాలంటే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం జాగ్రత్తలేమిటి?
- ఎమ్. కేశవరావు, విశాఖపట్నం
గుండె ఒక ప్రత్యేక కండరంతో తయారైన అవయవం. దీని పని నిరంతరం సంకోచిస్తుండటం, వ్యాకోచిస్తుండటం. సంకోచించినప్పుడు మొత్తం శరీరానికి రక్తం సరఫరా అవుతుంది. వ్యాకోచించినప్పుడు మొత్తం శరీరం నుంచి రక్తం గుండెకు చేరుతుంది. స్థూలంగా ఇదీ దీని పని. శరీరంలో ప్రతి చిన్న కణానికీ, ప్రతి కండరానికీ, ప్రతి అవయవానికీ రక్తం సరఫరా అయినప్పుడే అవి జీవిస్తాయి. వాటివాటి పనులను సక్రమంగా నిర్వహిస్తాయి.
ఈ సూత్రం గుండెకండరానికి కూడా వర్తిస్తుంది. రక్తసరఫరా నిమిత్తం గుండె నుంచి ఒక పెద్ద సైజు ధమని బయటకు వస్తుంది. దీనికున్న మొట్టమొదటి శాఖలే కొరొనరీ ధమనులు అనే రక్తనాళాలు. వీటి ద్వారా గుండె కండరానికి రక్తం అందుతుంది. ఇక్కడ విశేషమేమిటంటే... గుండె గదుల్లో ఉన్న శుద్ధ రక్తం ఫిల్టరేషన్ (మెల్లగా పీల్చుకోవడం) ప్రక్రియ ద్వారా గుండె కండరానికి అందే పద్ధతి లేదు. ఇదే సృష్టి విచిత్రం. అలాగకానీ ఉంటే మానవాళికి హార్ట్ ఎటాక్‌లు వచ్చేవే కాదు. పైన వివరించిన కొరొనరీ ధమనుల్లో రక్తప్రసరణకు అవరోధం కలిగినప్పుడు, గుండెకండరాలకి అందే రక్తం తగ్గిపోవడం జరుగుతుంది. రక్తం గడ్డకట్టడం వల్ల ఈ అవరోధం ఏర్పడుతుంది.
ఈ రక్తపు గడ్డల పరిమాణాన్ని బట్టి ఎటాక్ తీవ్రత ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు ఈ కొరొనరీ ధమనుల్లో గల సూక్ష్మాతిసూక్ష్మ శాఖల ద్వారా ‘బైపాస్’ ప్రసరణ చేసుకోగల శక్తి కొంతవరకు శరీరానికి ఉంటుంది. ఇదీ సృష్టి ప్రసాదించిన సహజ ప్రక్రియే. సర్జన్లు బైపాస్ సర్జరీ చేసినప్పుడు సత్ఫలితం కనిపిస్తుంది. కానీ ఇది సంపూర్ణంగా విజయవంతమవ్వాలంటే, శరీరానికి ఉన్న స్వతస్సిద్ధమైన బైపాస్ ప్రసరణ సమర్థతను బట్టే ఆధారపడి ఉంటుందని కొన్ని సిద్ధాంతాలు శాస్త్రీయ ఆధారాలు చూపిస్తున్నాయి.
రక్తం గడ్డకట్టడానికి కారణాలు
ఆహారంలో అతిగా కొవ్వుపదార్థాలు తింటే, అవి సంపూర్ణంగా ధాతు పరిణామం కాకపోవడం వల్ల రక్తనాళాలలో పేరుకుపోయి అవరోధం కలిగిస్తాయి. రక్తం గడ్డ కట్టడానికి దారితీస్తాయి. అనూహ్యంగా భయభ్రాంతులకు గురికావడం; ఒక్కసారిగా కానీ క్రమక్రమంగా గాని మానసిక ఒత్తిడులకు గురికావడం; ధూమపాన, మద్యపానాల వంటి మత్తుపదార్థాల దుష్ర్పభావాలు; స్థూలకాయం; మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులలో ఉపద్రవంగా కూడా గుండెపోటు సంభవించవచ్చు. అయితే చాలా తక్కువ శాతంలో మాత్రమే వారసత్వంగా గుండెపోటు కనిపిస్తుంది. కాబట్టి మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
నివారణ: పైన చెప్పిన కారణాలను దూరం చేసుకోవడం ప్రధానాంశం.
ఆహారం: ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించాలి. నూనెలు, వేపుళ్లు, వెన్న, నెయ్యి, ఇతర మధురపదార్థాలు, ఐస్‌క్రీమ్‌లు, శీతలపానీయాలు, జంక్ఫుడ్స్ పూర్తిగా వదిలేయాలి. ఆయుర్వేద సిద్ధాంతాలరీత్యా తగు ప్రమాణాల్లో నువ్వులనూనె, ఆవునెయ్యి వాడటం వల్ల శరీరానికి కొంతమేలు జరుగుతుందే తప్ప హాని ఉండదు. పీచు పదార్థాలున్న ఆహారం, మొలకలు, గ్రీన్ సలాడ్సు బాగా తీసుకోవాలి. శుష్కంగా ఉండే ఫలాలు మితంగా తినాలి. శాకాహారం, సాత్వికాహారం మంచి ప్రభావం చూపిస్తాయి.
విహారం: ఎవరి తత్వాన్ని బట్టి వారికి తగినంత ‘వ్యాయామం’ చేయటం అత్యావశ్యకం. నడక, ఆటలు, యోగాసనాలు మొదలైనవన్నీ వ్యాయామంలో అంతర్భాగాలే. రాత్రిపూట నిద్ర కనీసం ఆరుగంటలపాటు అవసరం. రెండుపూటలా పదేసి నిమిషాలపాటు ప్రాణాయామం చేయాలి. ఎల్లప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా, నవ్వుతూ, ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో, సానుకూల దృక్పథంతో ఉండటం అలవరచుకోవాలి. ఇది మానసిక ఆరోగ్యాన్ని కాపాడి, ఒత్తిడులను దూరం చేస్తుంది.
ఔషధం: రోజూ ఉదయం పరగడుపున ‘అల్లం మరియు వెల్లుల్లి’ కషాయం ఆరు చెంచాల మోతాదులో తాగాలి.
వారానికి మూడుసార్లు, సాయంత్రం పూట ‘తిప్పతీగె’ (గుడూచి) కషాయం కూడా తాగితే మంచిది.
ప్రతిరోజూ రాత్రి పడుకునేటప్పుడు ఒక చెంచా త్రిఫలచూర్ణం (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ) నీళ్లతో సేవించాలి.
గమనిక: ఈ సూచనలు పాటిస్తే హార్ట్ఎటాక్ మాత్రమే కాకుండా పక్షవాతం (బ్రెయిన్‌స్ట్రోక్) కూడా నివారితమవుతుంది. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది.
అప్పుడప్పుడూ మీకు నచ్చిన కొవ్వుపదార్థాలు, మధురపదార్థాలు తిన్నా పర్వాలేదు. కానీ దానికి విరుగుడుగా మూడు కిలోమీటర్లు నడవండి.
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్),
సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్,
హుమాయూన్ నగర్, హైదరాబాద్