Sivajiganesan
-
నెగటివ్‌గా రాయకండి ప్లీజ్
దయచేసి చిత్రాల గురించి నెగిటివ్‌గా రాయకండి అంటూ సీనియర్ నటుడు, నడిగర్ తిలకం శివాజీగణేశన్ వారసుడు ప్రభు మీడియాకు విజ్ఞప్తి చేశారు. బుధవారం పత్రికల వారితో ముచ్చటించిన ఆయన ప్రస్తుతం చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు మీకు తెలియనివి కాదని, సినిమాను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని పేర్కొన్నారు. ప్రేక్షకులు సినిమాలు చూడడానికి థియేటర్లకు రావడమే కష్టం అయిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా విమర్శలు రాసేటప్పుడు నెగిటివ్‌గా రాయరాదని విన్నవించారు. విమర్శలు చేయండి తప్పొప్పులను రాయండి కానీ చిత్రం చెత్తగా ఉంది లాంటి పదాలు చేర్చడం వల్ల ప్రేక్షకులు థియేటర్ల వైపే రావడం లేదన్నారు. ఈ తరం నటీనటులు, సాంకేతికవర్గం మంచి చిత్రాలు చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. పత్రికల వారితో తనకున్న అనుబంధంతో ఈ సూచన చేస్తున్నానని పేర్కొన్నారు. ఇక తాను ప్రస్తుతం నటించడం తగ్గించుకున్నానని, మంచి పాత్రలు అనిపిస్తే చేయడానికి అంగీకరిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం తన అన్నయ్య కొడుకు దుశ్యంత్ రామ్‌కుమార్ నిర్మాతగా మారి ఈశన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న మీన్‌కొళంబుం మణ్ పానైయం చిత్రంలో మాత్రమే నటిస్తున్నానని, ఇందులో నటుడు కమలహాసన్ అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలిపారు. తన కొడుకు విక్రమ్ ప్రభు నటించిన వీరశివాజీ నవంబర్ తొలివారంలో విడుదల కానుందని తెలిపారు. తదుపరి సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ముడిచూడ మన్నన్ చిత్రంతో పాటు, తను నిర్మాతగా మారి ఫస్ట్ ఆర్టిస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న నెరుప్పుడా చిత్రంలోనూ నటిస్తున్నారని తెలిపారు.ఈ సమావేశంలో నటుడు విక్రమ్‌ప్రభు, రామ్‌కుమార్ పాల్గొన్నారు. -
మహానటి సావిత్రిగా తెరపైకి నిత్యామీనన్
మహానటి సావిత్రిని భారతీయ సినిమా ఎప్పటికీ మరచిపోదు. నటిగా సావిత్రి సజీవం. దక్షిణాది భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించిన మహానటి సావిత్రి. మహా మహులైన నటులందరితోనూ నటించిన ఘనత సావిత్రిది. తమిళంలో శివాజీగణేశన్‌ను నడిగర్ తిలకంగా కొనియాడితే, సావిత్రి నటి తిలకంగా కీర్తించబడ్డారు. ప్రఖ్యాత నటుడు జెమినీగణేశన్‌ను ప్రేమించి పెళ్లాడిన సావిత్రి సొంతంగా చిత్ర నిర్మాణం చేపట్టి తీవ్ర నష్టాల పాలై ఆస్తులను పోగొట్టుకున్నారు. అలాంటి మహానటి నిజ జీవితం సుఖ దుఃఖాలమయం. అలాంటి అభినేత్రి జీవితచరిత్ర తెరకెక్కనుంది. ఇటీవల తెలుగులో ఎవడే సుబ్రహ్మణ్యం వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన అశ్విన్ సావిత్రి జీవిత చరిత్రను తమిళం, తెలుగు భాషల్లో దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి మహానది అనే పేరును నిర్ణయించినట్లు తెలిసింది. ఇది ఇంతకు ముందు విశ్వనటుడు కమలహాసన్ నటించిన చిత్రం పేరు అన్నది గమనార్హం. ఇకపోతే ఇందులో సావిత్రి పాత్రలో నటి నిత్యామీనన్ నటించనున్నారు. సావిత్రి మాదిరిగానే కాస్త పొట్టిగా, బొద్దుగా ఉండడం, ముఖ్యంగా దక్షిణాది భాషల్లో పేరున్న నటి కావడంతో ఈ అవకాశం నిత్యామీనన్‌ను వరించిందన్నది గమనార్హం. ఇతర నటీనటులు,తదితర వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
శివాజి నిర్మాణ సంస్థలో ఆ ఇద్దరు
దివంగత మహానటుడు శివాజీగణేశన్‌కు చెందిన శివాజీ ప్రొడక్షన్లో ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు.అంతే కాదు శివాజీ ప్రొడక్షన్ సంస్థలో సూపర్‌స్టార్ రజనీకాంత్ మన్నన్, చంద్రముఖి,కమలహాసన్ వెట్ట్రివిళా, అజిత్ అసల్ వంటి పలు చిత్రాలు నిర్మాణం అయ్యాయి. కొన్నేళ్లుగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్న ఈ సంస్థ తాజాగా మళ్లీ రంగంలోకి దిగింది. ఒకే సారి రెండు చిత్రాలను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి ఇళయదళపతి విజయ్ హీరోగా నిర్మించనున్నట్లు, దీనికి తెరి చిత్రం ఫేమ్ అట్లీ గానీ జిల్లా చిత్రం ఫేమ్ నెల్సన్ గానీ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. మరో చిత్రంలో శివాజీ కుటుంబ వారసుడు విక్ర మ్ప్రభు కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం. దీనికి నవ దర్శకుడు అశోక్ మెగాఫోన్ పట్టనున్నారు. విశేషం ఏమిటంటే శివాజీ ప్రొడక్షన్స్ సంస్థలో విజయ్ తొలిసారిగా నటించనున్నారు.అదే విధంగా నటుడు విక్రమ్‌ప్రభు ఇప్పటి వరకూ సొంత బ్యానర్లో నటించలేదు. ప్రప్రథంగా ఇప్పుడు నటించడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. విజయ్ ప్రస్తుతం తన 60వ చిత్రాన్ని విజయా ప్రొడక్షన్‌కు చేస్తున్నారు. భరతన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్నారు. దీనికి గతంలో ఎమ్జీఆర్ నటించిన ఎంగవీట్టి పిళ్లై చిత్ర టైటిల్‌ను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తన 61వ చిత్రాన్ని శివాజీ ప్రొడక్షన్స్ సంస్థకు చేయనున్నట్లు సమాచారం.