ముక్కంటి నిధిపై నేతల పెత్తనం
ఉయ్యూరు :
ఉయ్యూరు శివాలయంపై రాజకీయ పడగ పడింది. అధికార పార్టీకి చెందిన ఇరువురు ముఖ్య నేతలు ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటూ దేవాదాయ అధికారులపై రకరకాల ఒత్తిళ్లు తెస్తున్నారు. స్వామి వారి సొమ్ముపై పెత్తనం పెచ్చుమీరడంతో శివశివా దేమిటి అని భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. స్థానికంగా ప్రసిద్ధి చెందిన శ్రీ జగదాంబ సమేత సోమేశ్వరస్వామి (శివాలయం) ఆలయం భూమి 2.70 ఎకరాలు రహదారి విస్తరణలో పోయింది. ఈ భూమికి ప్రభుత్వం నుంచి రూ.8 కోట్ల 36 లక్షల 70 వేల 835లు నిధుల నష్టపరిహారం వచ్చింది. 20 రోజుల క్రితం ఈ మొత్తాన్ని ఆలయ వ్యవహారాల ఖాతా ఉన్న ఇండియన్ బ్యాంక్‌కు ఈ మొత్తం సొమ్ము జమైంది. ఈ కోట్లాది రూపాయలను స్వామివారి పేరిట డిపాజిట్ చేయాల్సి ఉంది. ఈ సొమ్మును తాము చెప్పిన బ్యాంకులోనే డిపాజిట్ చేయాలని ఆ ఇద్దరు నేతలు ఒత్తిళ్లకు దిగారు. పోరంకిలోని ఎస్బీఐ బ్యాంకులో జమ చేయాలని ఒకరు, కాదు ఉయ్యూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌లో అని మరొకరు అధికారులకు హుకుం జారీచేశారు. ఎవరి ఆదేశం పాటించాలో పాలుపోక ఆలయ అధికారులు తలపట్టుకున్నారు. తాము చెప్పిన బ్యాంకులోనే ఈ భారీమొత్తాన్ని జమచేయిస్తే బ్యాంకుల నుంచి నజరానాలతో పాటు సొమ్ముపై పెత్తనం చలాయించవచ్చనేది ఆ నేతల దురాలోచనగా తెలుస్తోంది. డిపాజిట్‌పై ఏం చేయాలని కాకినాడ డిప్యుటీ కమిషనర్‌కు అధికారులు లేఖ రాసినట్లు సమాచారం.